Promotions : గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు..-lecturers working in government junior colleges of telangana state will be promoted soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Promotions : గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు..

Promotions : గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు..

Basani Shiva Kumar HT Telugu
Sep 07, 2024 10:50 AM IST

Promotions : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేసింది. అర్హత ఉన్నవారు 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.

జూనియర్ కాలేజీల ఉద్యోగులకు ప్రమోషన్లు
జూనియర్ కాలేజీల ఉద్యోగులకు ప్రమోషన్లు (HT)

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలకు.. డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యులుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదోన్నతికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పీజీలో 55 శాతం మార్కులు, నెట్‌-స్లెట్‌-పీహెచ్‌ ఉన్న ఉద్యోగులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని.. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన స్పష్టం చేశారు.

ఉచితంగా ఎంసెట్ కోచింగ్..

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి.. ప్రత్యేక జాబ్‌ మేళాలను నిర్వహించాలని ఆదేశించింది. విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రత్యేక స్టడీ మెటీరియల్..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 400 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఎంసెట్‌, నీట్‌, జేఈఈ, సీఏ వంటి కోర్సుల కోచింగ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో.. ప్రతీ రోజు 50 నిమిషాల పాటు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జూనియర్‌ లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా తెలుగు అకాడమీ ద్వారా సిద్ధం చేస్తున్నారు.

కంపెనీలతో అనుసంధానం..

తెలంగాణలో దాదాపు 187 కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. 22 రకాల కోర్సులను ఈ కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, సివిల్‌ వంటి 7 ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీలు, సంస్థలతో అవగాహనఒప్పందాలు చేసుకొని.. కళాశాలలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యోగ అవకాశాలు..

విద్యార్థులు నైపుణ్యం సాధించాక.. జాబ్‌ మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు చేయడం కోసం ప్రత్యేక అకడమిక్‌ గైడెన్స్‌, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సెల్‌లో పనిచేయడం కోసం ముగ్గురు జూనియర్‌ లెక్చరర్లను డిప్యూటేషన్‌పై నియమించనున్నారు.