Khammam Crime : ఖమ్మంలో అమానవీయ ఘటన, దత్తత పేరుతో సొంత మనవడిని అమ్మేసిన నాయనమ్మ
Khammam Crime : ఖమ్మం నగరంలో ఓ నాయనమ్మ సొంత మనవడినే విక్రయించింది. దత్తత ఇస్తున్నట్లు డ్రామా ఆడి రూ.5 లక్షలకు మనవడిని అమ్మేసింది. ఈ వ్యవహారంలో మహిళా కార్పొరేటర్ భర్త హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
Khammam Crime : దత్తత పేరుతో ఒక నాయనమ్మ సొంత మనవడినే మరొకరికి విక్రయించిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. చివరికి ఆ తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఖమ్మం నగరం వన్ టౌన్ ప్రాంతానికి చెందిన స్వప్నకి 2021లో ఖమ్మం నగరానికే చెందిన సాయితో వివాహం జరిగింది. సాయి ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అనంతరం వారికి ఒక బాబు జన్మించాడు. కాగా బాబు పుట్టిన నెల రోజులకే తండ్రి సాయి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో స్వప్న తన కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. కాగా తన కొడుకు గుర్తుగా ఉన్న మనవడిని తనకు ఇవ్వాలంటూ నాయనమ్మ స్వప్నపై ఒత్తిడి తెచ్చింది. కొంతకాలం తర్వాత దత్తత పేరుతో వేరొకరికి ఇచ్చేందుకు సైతం నాయనమ్మ సిద్ధపడింది. ఈ ఎపిసోడ్ లో ఖమ్మం నగరానికి చెందిన ఒక మహిళా కార్పొరేటర్ భర్త శేషగిరి అనే రాజకీయ నాయకుడు సైతం రంగంలోకి దిగాడు.
రూ.5 లక్షలకు విక్రయం
అత్త రమాదేవితో పాటు కార్పొరేటర్ భర్త శేషగిరి కలిసి స్వప్నను ఏమార్చారు. బాబును వేరొకరికి దత్తత ఇచ్చేస్తే మరో పెళ్లి చేసుకోవచ్చని నమ్మబలికారు. దీంతో దత్తత పేరుతో బాబును నెల రోజుల కిందట నాయనమ్మ తీసుకెళ్లింది. కార్పొరేటర్ భర్త సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కు తరలించారు. దీంతో అనుమానం వచ్చిన తల్లి కార్పొరేటర్ భర్త శేషగిరి వద్దకు వెళ్లి ఆరా తీసింది. తన కొడుకు ఎక్కడ ఉన్నదీ చెప్పాలని నిలదీసింది. అయినా అతని వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె అనుమానం బలపడింది. ఇక లాభం లేదని భావించి బుధవారం ఖమ్మం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్త రమాదేవికి ఫోన్ చేసి బాబును ఖమ్మం రప్పించారు.
పోలీసులు విచారించగా 21 నెలల వయసున్న యశ్వంత్ ను రూ. 5 లక్షలకు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో తేలింది. బాబును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లి స్వప్నకు ఇచ్చారు. డబ్బులకు ఆశ పడి కన్న కొడుకు పేగు బంధాన్నే విక్రయించాలని చూసిన నాయనమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్న తరుణంలో ఖమ్మం నగరంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన సంచలనం కలిగించింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం