Khammam Drugs : అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్, ఖమ్మంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్-khammam software engineer arrested bought drugs from assam in speed post ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Drugs : అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్, ఖమ్మంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

Khammam Drugs : అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్, ఖమ్మంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 08:32 PM IST

Khammam Drugs : ఖమ్మంలో హెరాయిన్ పట్టుబడింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అసోం నుంచి డ్రగ్స్ ను స్పీడ్ పోస్టులో తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు.

అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్, ఖమ్మంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్
అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్, ఖమ్మంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

Khammam Drugs : ఖమ్మంలో డ్రగ్స్ జాడలు కలకలం రేపుతున్నాయి. ఎన్నడూ లేనిది మొట్ట మొదటి సారిగా ఖమ్మం నగరంలో హెరాయిన్ పట్టుబడింది. ఓ వ్యక్తి అసోం నుంచి దీన్ని స్పీడ్ పోస్ట్ లో తెప్పించుకోవడం గుబులు పుట్టిస్తోంది. అయితే అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడం విస్తు గొలుపుతోంది. హెరాయిన్ కు అలవాటు పడిన ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తరచుగా డ్రగ్స్ తెప్పించునేవాడని అనుమానాలు కలుగుతున్నాయి. ఖమ్మం నగరం రోటరీ నగర్ రెండో లైన్ లో నివాసం ఉండే ఆ ఉద్యోగి తాజాగా అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో తెప్పించుకున్న హెరాయిన్ పోలీసులకు పట్టుబడింది. ఖమ్మం టూ టౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మితిమీరి డ్రగ్స్ కు అలవాటు పడి, బానిసగా మారిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిత్యం డ్రగ్స్ తోనే సహ జీవనం చేసేవాడని స్పష్టం అవుతోంది. అసోం నుంచి ఖమ్మం నగరానికి డ్రగ్స్ డెలివరీ అవుతున్నట్లు సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు డార్క్ వెబ్ ఆపరేషన్ ద్వారా స్పీడ్ పోస్ట్ లో వచ్చిన హెరాయిన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

యువత డ్రగ్స్ మత్తులో జోగుతోందా?

ప్రధానంగా యువతనే టార్గెట్ చేస్తూ డ్రగ్స్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరింపజేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల విషయానికి వస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా గంజాయి పెద్ద ఎత్తున తరలిపోవడం సర్వసాధారణంగా మారుతోంది. చత్తీస్గడ్ తో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు గంజాయి తరలి వెళుతుండగా పోలీసులు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏకంగా ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న ఉదంతం కూడా చోటుచేసుకుంది. అయితే జిల్లాలోని కొందరు యువకులు మద్యపానం, ధూమపానంతో పాటు గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా కొందరు ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కొందరు సైతం ఈ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నట్లు ప్రచారం ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై యుద్ధమే ప్రకటించింది. పోలీసుల చేతికి పగ్గాలు అప్పగించి మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం మోపేలా చర్యలు చేపట్టింది. మరోవైపు అధికార యంత్రాంగం యువతను చైతన్య పరుస్తూ, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయినా సరే ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ఆనవాళ్లు బయట పడుతూనే ఉండటం విస్మయం కలిగిస్తోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం