Electric Car : ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు-khammam engineer makes electric car that gives 300 km range know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Electric Car : ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు

Electric Car : ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు

HT Telugu Desk HT Telugu
Jun 04, 2022 09:39 PM IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు ఘోరంగా పెరిగాయి. సామాన్యూడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ కారును తయారు చేశాడు.

<p>ఎలక్ట్రిక్ కారు</p>
ఎలక్ట్రిక్ కారు

దేశంలో పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆలస్యంగానైనా దేశవ్యాప్తంగా ప్రజలలో ఆదరణ పొందుతున్నాయి. అయితే మార్కెట్ ట్రెండ్ ను పట్టుకున్న.. ఓ బీటెక్ గ్రాడ్యూయేట్.. ఎలక్ట్రిక్ కారును తయారు చేశాడు. అది కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల కిలోమీటర్లు వెళ్లేలా తయారు చేశాడు.

ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ గార్లపాటి రాకేష్‌ ఎలక్ట్రిక్ కారును రూపొందించాడు. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీలతో సుమారు 300 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగల రెట్రోఫిట్డ్ ఎలక్ట్రిక్ కారును తయారు చేశాడు. బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి, ఆ దూరాన్ని కవర్ చేయడానికి నిర్వహణ ఖర్చు తక్కువే అవుతుందని అతడు చెబుతున్నాడు.

'నేను అభివృద్ధి చేసిన వాహనం.. ప్రాథమికంగా పాతకాలపు మోడల్ కారును రీడిజైన్ చేసి, ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీలతో తిరిగి అమర్చాను. కారు తయారీకి రూ.3 లక్షలు ఖర్చవుతుంది.' అని రాకేష్ అన్నారు.

ఇది నాలుగు సీట్ల వాహనం. 15 కిలోవాట్ మోటార్ మరియు ప్రిస్మాటిక్ లిథియం బ్యాటరీలు అమర్చబడి ఉంటాయి. ఇవి పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 10 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. కారులో రివర్స్, నార్మల్, ఎకో మరియు ఫాస్ట్ మోడ్ అనే నాలుగు రన్నింగ్ మోడ్‌లు ఉన్నాయి.

సాధారణ మోడ్‌లో వాహనం గంటకు 0-25 కి.మీల మధ్య వేగంతో నడుస్తుంది. ఎకో మోడ్‌లో గంటకు 0-50 కి.మీ వేగంతో కదులుతుంది. ఫాస్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. రివర్స్ మోడ్ కారును రివర్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రతి మోడ్‌లో వాహనానికి స్పీడ్ లిమిట్ ఉంటుంది.

బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌తో జత చేశారు. ఇది బ్యాటరీలోని ప్రతి విషయాన్ని.. ఫోన్ కు అందిస్తుంది. అంటే ఛార్జింగ్ స్థాయి, ఇతరుల పరిస్థితులను చెబుతుంది. బ్యాటరీలో లోపాలు ఉన్నట్లయితే, పరిష్కార చర్యలు తీసుకోవాలని వినియోగదారుని హెచ్చరిస్తుంది. కారు తయారీలో ఉపయోగించే మొత్తం పరికరాలు, విడిభాగాలను ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) ద్వారా ధృవీకరించారు.

వాహనాన్ని తయారు చేయడానికి తనకు ఒక నెల సమయం పట్టిందని రాకేష్ చెబుతున్నాడు. ఇది పూర్తిగా చేతితో తయారు చేసినట్టుగా వెల్లడించాడు. ఇటీవల రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఎదుట వాహనం పనితీరును ప్రదర్శించగా.. ఆయన మెచ్చుకున్నట్టుగా తెలిపారు.

రాకేష్ ఇప్పుడు ఖమ్మంలో ఒక స్టార్టప్ సంస్థను ప్రారంభించాలని చూస్తున్నాడు. కొంతమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకుని.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన ప్రయత్నానికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. 2019లో రాకేష్ ఎలక్ట్రిక్-బైక్‌ను కూడా తయారు చేశాడు.

Whats_app_banner