Khairatabad Ganesh Nimajjanam : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి
Khairatabad Ganesh Nimajjanam 2023:ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్ వరకు ఘనంగా సాగింది.
Khairatabad Ganesh Nimajjanam 2023: వినాయక చవితి వేడుకలు ముగిశాయి. భక్తజన కోలాహాలం మధ్య గణనాథులు… తల్లి గంగమ్మ ఒడికి చేరాయి. ఇక ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ముగిసింది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన శోభాయాత్ర హుస్సేన్‌సాగర్ వరకు ఘనంగా సాగింది. మధ్యాహ్నం 1 గంటల తర్వాత…. ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.
తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ గణనాథుడు.. నవరాత్రులు పూజలు అందుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఇక ఇవాళ ఉదయం మొదలైన శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బైబై గణేశా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.
హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న తర్వాత చివరిసారిగా ఖైరతాబాద్ గణనాథుడికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత 4వ నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ మళ్లించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
కొనసాగుతున్న బాలాపూర్ గణేశుడి యాత్ర…
మరోవైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతుంది. మొత్తం 19 కిలోమీటర్లు సాగనుంది. హుస్సేన్‌సాగర్, మోజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఇక బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను తుర్కయాంజిల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి పాడుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తన తల్లితండ్రులకు కానుకగా ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వేలంలో పాల్గొన్నా రూ.22లక్షల రుపాయల వద్ద వేలంలో తాను ఆగిపోయినట్లు చెప్పారు.
బాలాపూర్ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. గత ఏడాది లడ్డూను వేలంలో రూ.24.60లక్షలకు విక్రయించారు. ఈ ఏడాది రూ.27లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది నుంచి లడ్డూ వేలంలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉత్సవ కమిటీ తీర్మానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి వేలంలో లడ్డూ పాడుకున్న వారు అదే ఏడాది డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వేలం సొమ్ములు చెల్లించడానికి గడువు ఇచ్చే వారు. ఇకపై వేలం సొమ్మును అదే ఏడాది చెల్లించాలని నిర్ణయించారు.