K Keshav Rao : కేకే కీలక నిర్ణయం - ఎంపీ పదవికి రాజీనామా
K Keshav Rao Resignation: కాంగ్రెస్ లో చేరిన కే కేశవరావు గురువారం తన ఎంపీ(రాజ్యసభ) పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతికి లేఖను అందజేశారు.
K Keshav Rao : బీఆర్ఎస్ పార్టీని వీడిని తిరిగి కాంగ్రెస్ లో చేరిన కే కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన… తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఉపరాష్ట్రపతిని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడిగా మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని కేకే గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కేకే హస్తం పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
రాజీనామా లేెఖ ఇచ్చిన అనంతరం మాట్లాడిన కేకే…. కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను, బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగలేనని క్లారిటీ ఇచ్చారు. నైతికతకు కట్టుబడే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ లో చేరిక…!
కే కేశవరావు… కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. పార్టీలో కూడా ఆయనకు అధికా ప్రాధాన్యత లభించింది. రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేకే…. బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేతగా మెలిగారు.
ఓవైపు కేకే ఎంపీగా ఉండగానే… ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన కుమారుడు విప్లవ్ కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(2023) బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి. కేవలం 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ…. ఘర్ వాపసీ అంటోంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి రప్పిస్తోంది.
ఇప్పటికే చాలా మంది నేతలను పార్టీలో చేర్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే కేకేతో హస్తం పెద్దలు చర్చలు జరిపారు. ముందుగా ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పార్టీలో చేరారు. ఇదే సమయంలో కేకే కూడా పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ కేకే మాత్రం కాంగ్రెస్ లో అధికారికంగా చేరలేదు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత… కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదను పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మరికొంత మంది కూడా చేరే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతారనే లీకులు వస్తున్నాయి. చేరికలు ఊపందుకున్న వేళ… బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే కూడా బుధవారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.