Karimnagar Master Plan : కరీంనగర్ రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్, ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ
Karimnagar Master Plan : కరీంనగర్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సుడా ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Karimnagar Master Plan : కరీంనగర్ రూపురేఖలు మార్చి మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రెండేళ్ళుగా ముందుకు సాగని మాస్టర్ ప్లాన్ త్వరలో అమల్లోకి తెచ్చే విధంగా కసరత్తు సాగుతుంది. అందుకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నేతృత్వంలో ఈనెలాఖరులో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించి సర్కార్ కు నివేదిక ఇచ్చే పనిలో అధికారులు పాలకులు నిమగ్నమయ్యారు.
కరీంనగర్ నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేషన్ నుంచి గ్రేటర్ కరీంనగర్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ నగర పాలక సంస్థలో 60 డివిజన్లు, సుడా పరిధిలో 20 మండలాలు, 71 గ్రామాలు ఉన్నాయి. నగర విస్తీర్ణం 65.33 చ.కి.మీలకు విస్తరించి నగర జనాభా 3.50 లక్షలకు చేరింది. సుడా విస్తీర్ణం 527.29చ.కి.మీ.లకు విస్తరించి సుడా జనాభా 4.59 లక్షలకు చేరింది. విస్తీర్ణం జనాభా పెరిగినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పాత మాస్టర్ ప్లాన్ ను కొనసాగిస్తున్నారు. 27 ఏళ్ల క్రితం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ఇంకా కొనసాగిస్తుండడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2041 వరకు అమలు చేసేలా సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో పట్టణీకరణ పెరిగింది. నగరంలో విలీన గ్రామాలు కలిశాయి. గ్రామాల్లో సైతం పట్టణ స్థాయిలో వసతుల కల్పన జరుగుతోంది. కాలనీల సంఖ్య పెరిగిపోవడంతో ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్ లేకుండా స్థలాలు కొనుగోలు చేయడంతో అనేక సమస్యలకు కారణంగా మారుతోంది. అమృత్ స్కీమ్ తో నగరంతో పాటు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల కొలతలు, పార్కులు, సామాజిక స్థలాలు, ప్రభుత్వ స్థలాల గుర్తింపు, పారిశ్రామిక ప్రాంతం, నివాసిత, వాణిజ్య ప్రాంతాలు సులువుగా గుర్తించి అనుమతులు ఇచ్చే అవకాశముంటుంది.
బేస్ మ్యాప్ తయారు
కొత్త ప్రణాళికను తయారు చేసేందుకు వీలుగా రెండేళ్ల క్రితమే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. భౌగోళిక సమాచార విధానం (జియో గ్రాఫికల్ ఇన్మరేషన్ సిస్టమ్) జీఐఎస్ విధానంలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపట్టారు. నివాసిత, వాణిజ్య ప్రాంతాలు, రోడ్లు, భవనాల ఎత్తు, మురుగునీటి కాలువలు, ప్రభుత్వ స్థలాలు పలు వివరాలతో బేస్ మ్యాపు తయారు చేశారు. నగరపాలిక, సుడా పరిధిలో జీఐఎస్ ఆధారిత ప్రణాళికపై తుది కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టర్, మేయర్, సుడా చైర్మన్ అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు.
20 ఏళ్ళకోసారి మాస్టర్ ప్లాన్
కరీంనగర్ నగర పరిధిలో 1997లో ఆమోదించిన పట్టణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ 20 ఏళ్లకు ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. నాటి పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే భవన అనుమతులు, రహదారుల విస్తరణకు వాడుతున్నారు. జిల్లాలో కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యాయి. కొన్ని గ్రామాలు విలీన మయ్యాయి. సరిహద్దులు మారాయి. కొత్త ప్రణాళికలు తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సుడా దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలు అయితే అమృత్ పథకం క్రింద కేంద్రం నిధులు కేటాయించనుంది. డిసెంబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆ పథకం గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఎవరికి వారు నిధులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెలాఖరులో సమావేశం
మాస్టర్ ప్లాన్ పై ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్దం కావడంతో దాన్ని ఆమోదించి అమలు చేసేందుకు నెలాఖరు లోగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అడనపు కలెక్టర్లు, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకొని మార్పులు చేర్పులుంటే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు గడువులోగా మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు రాబోయే రోజులు సుడా విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.