MBBS Notification : అలర్ట్... ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, నేటి నుంచే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు
Kaloji health University Admissions 2024 : ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వివరాలను పేర్కొంది. ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆగస్టు 23వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలు, మైనారిటీ కళాశాలల్లో వీటి ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ మేరకు శనివారం కాళోజీ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఆర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆగస్టు 23వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. https://www.knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని వివరించారు. మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్లు, తరగతుల ప్రారంభానికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9392685856, 7842136688, 9059672216 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తు రుసుం చెల్లించే విషయంలో ఇబ్బందులు తలెత్తితే 9618240276 ను సంప్రదించాలి.
అప్ లోడ్ చేయాల్సినవి…
- నీట్ యూజీ ర్యాంక్ కార్డు - 2024
- పదో తరగతి మార్కుల మెమో
- ఇంటర్ మార్కుల మెమో
- స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- కుల ధ్రువీకరణ పత్రం
- మైనార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా మైనార్టీ సర్టిఫికెట్ ను సమర్పించాలి.
- ఆధార్ కార్డు
- లేటెస్ట్ పాస్ ఫొటోలు
- అభ్యర్థి సంతకాన్ని కూడా అప్ లోడ్ చేయాలి.
ఏపీలోనూ నోటిఫికేషన్:
మరోవైపు ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా (మేనేజ్‌మెంట్ కోటా) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్లు.. తిరుపతిలోని స్వీమ్స్ కింద ఉన్న పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు దాఖలు చేసేందుకు గడువు ఆగస్టు 21గా నిర్ణయించారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీట్ యూజీ-2024 అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు ఉంది. అదనపు ఫీజుతో ఆగస్టు 23వ తేదీ సాయంత్ర 6 గంటల వరకు సమయం ఉంది. అయితే.. ఆగస్టు 16 (శుక్రవారం) సాయంత్రం 7 గంటల నుంచి ఆగస్టు 18 (ఆదివారం) రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వివరించారు.
యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు దాఖలు చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు రూ.10,620 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఫీజు రూ.30,620తో ఆగస్టు 21 తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఫేజ్-II, ఫేజ్-III వెబ్‌ఆప్షన్‌ల కోసం నోటీసు జారీ చేయడానికి ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
టాపిక్