Jitta Political Journey : 20 ఏళ్ల పోరాటం.. దక్కని ప్రతిఫలం..! విషాదంగా ముగిసిన జిట్టా రాజకీయ జీవితం..!-jitta balakrishna reddy did not get a single official post in govt his 20 year political journey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jitta Political Journey : 20 ఏళ్ల పోరాటం.. దక్కని ప్రతిఫలం..! విషాదంగా ముగిసిన జిట్టా రాజకీయ జీవితం..!

Jitta Political Journey : 20 ఏళ్ల పోరాటం.. దక్కని ప్రతిఫలం..! విషాదంగా ముగిసిన జిట్టా రాజకీయ జీవితం..!

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 10:57 PM IST

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క అధికారిక పదవికి నోచుకోలేదు. అన్ని పార్టీలు కూడా ఆయన్ను వాడుకుని వదిలేశాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జిట్టా రాజకీయ జీవితం విషాదాంతంగా ముగియటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.

జిట్టా బాలక్రిష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)
జిట్టా బాలక్రిష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)

నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారునిగా పేరు తెచ్చుకున్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి రాజకీయ జీవితం విషాదంగా ముగిసింది. యువజన సంఘాల సమాఖ్య నుంచి మొదలైన సామాజిక సేవా ప్రస్థానం 2003లో నాటి టీఆర్ఎస్ తో మొదలై నేటి బీఆర్ఎస్ తో ముగిసింది.

మధ్యలో ఆయన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సొంతంగా ఏర్పాటు చేసిన యువ తెలంగాణ పార్టీ ఆ తర్వాత బీజేపీ, తిరిగి కాంగ్రెస్ ల మీదుగా చివరకు బీఆర్ఎస్ తీరం చేరింది. రెండు దశాబ్ధాల కాలంలో జిట్టా ఏ ఒక్క పదవినీ పొందలేక పోయారు. తెలంగాణ ఉద్యమకారునిగా పల్లెపల్లెనా ఆదరణ మినహా ప్రజాజీవితంలో పదవి దక్కకుండానే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది.

దక్కని అధికారిక పదవులు

జిట్టా బాలక్రిష్ణారెడ్డి నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ లో 2003లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అయ్యారు. 2004లో భువనగిరి శాసన సభా నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేశారు. కానీ, టికెట్ పార్టీ నేత ఆలె నరేందర్ కు దక్కడంతో ఆయనకు మద్దతు ఇచ్చారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీల పొత్తు పుణ్యమాని టికెట్ దరిచేరనే లేదు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇలా వరసగా 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు స్వతంత్రంగానే పోరాడుతూ వచ్చినా, ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆయన కోరిక తీరలేదు. 2009 ఎన్నికల సందర్భంగా టికెట్ దక్కకపోవడం, ఆయన అనుచరులు భువనగిరిలో బహిరంగ సభకు వచ్చిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి రచ్చ చేయడం తర్వాత జరిగిన వరస సంఘటనలతో నాటి టీఆర్ఎస్ కు దూరమయ్యారు.

ఆ తర్వాత నాటి ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కొన్నాళ్లకే వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోవడంతో ఆయనకు కాంగ్రెస్ లో అండలేకుండా పోయింది. వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా.. ప్రత్యేక తెలంగాణకు జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేక స్టాండ్ తీసుకోవంతో ఆ పార్టీని కూడా వీడి.. సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించి పదేళ్ల పాటు పోరాడారు.

తన రాజకీయ భవిష్యత్ ను ద్రుష్టిలో పెట్టుకుని తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కానీ, స్థానిక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంలోని కొందరితో పొసగక బీజేపీని కూడా విడిచిపెట్టారు. 2023 శాసన సభ ఎన్నికల ముందు జిట్టా మరో మారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కలేదు. చివరకు 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ దక్కుతుందని ఎదురు చూసినా ఆయనకు నిరాశే మిగిలింది. ఇలా మొత్తంగా రెండు దశాబ్ధాలుగా ఆయన ఒంటిపోరాటం చేసి ఎలాంటి పదవులు దక్కకుండానే, చివరకు ఎమ్మెల్యే కాకుండా తుదిశ్వాస విడిచారు.

ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు

తెలంగాణ ఉద్యమకారునిగా ఊరూరా పరిచయాలు ఉన్న జిట్టా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గళమెత్తారు. భువనగిరి నియోజకవర్గంలో జనానికి ఓక పీడగా పరిణమించి మూసీ కాలుశ్యంపై ఉద్యమం చేశారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని రెండు వందల కిలో మీటర్ల పాదయాత్ర చేసి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.3.50కోట్ల సొంత నిధులు వెచ్చించి వందకు పైగా గ్రామాల్లో వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తన సొంత నిధులతో భువనగిరిలో కిసాన్‌ నగర్‌ లో రూ. 6 లక్షలు వెచ్చిచిం పార్కును డెవలప్ చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ స్కీమ్ రాష్ట్రానికి పరిచయం కాకముందే 30 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు చెల్లించారు.

బీబీనగర్‌ వద్ద నెలకొల్పిన నిమ్స్‌ ఆసుప్రతిని ఎయిమ్స్ గా మార్చాలని ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ సర్కారు ఈ ఆసుపత్రిని సినిమా షూటింగుల కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. భువనగిరి రైతుల కోసం కూడా ఉద్యమాలు చేసిన ఆయన నియోజకవర్గానికి క్రిష్ణా జలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఆయన 350 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బునాదిగాని కాలువ, పిల్లయిపల్లి కాలువ, బొల్లేపల్లి కాలువల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేపట్టారు.

కలిసిరాని సొంతపార్టీ

టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లనుంచి బయటకు వచ్చిన జిట్టా సొంత పార్టీ ఏర్పాటుకు మొగ్గు చూపారు. మొదట యువ తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన చివరకు యువ తెలంగాణ జేఏసీని యువ తెలంగాణ పార్టీగా ఏర్పాటు చేశారు.

నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో, అంతకు ముందు భువనగిరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసినా కలిసి రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుండిన రాణి రద్రమను పోటీకి పెట్టారు. జిట్టా స్వయంగా భువనగిరి నుంచి బరిలోదిగి విఫలమయ్యారు. ఈ చేదు ఫలితాల తర్వాత ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కానీ, బీజేపీ విధానాలను ప్రశ్నించి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

దీంతో 2023 ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, అధికార పార్టీలో ఉండకుండా, 2023 అక్టోబర్‌ లో తిరిగి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరిన జిట్టా సొంత ఇంటికి చేరాన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇన్ని పార్టీలు తిరిగినా, ఇన్ని కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టినా, నిత్యం ప్రజల కోసం పరితపించినా.. జిట్టాకు ఏ పార్టీ నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కేలేదు. ఒక విధంగా ఆయనను అన్ని పార్టీలు వాడుకుని వదిలేశాయన్న అభిప్రాయం జిట్టా సహచర నాయకులు పేర్కొంటున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )