Jagtial News : భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ టవర్ ఎక్కిన భర్త, చివరికి?
Jagtial News : భార్య కాపురానికి రావడంలేదని జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. పోలీసులు అతడికి సర్ధిచెప్పి విద్యుత్ టవర్ దిగేలా చేశారు.
Jagtial News : భార్యాభర్తల మధ్య వివాదం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. తన భార్య కాపురానికి రావడంలేదని ఓ వ్కక్తి హైవోల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. తన భార్య కాపురానికి రావడం లేదని అతడు హెవీ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య కాపురానికి రాకుంటే హెవీ విద్యుత్ టవర్ నుంచి దూకేస్తానని బెదిరించాడు. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు అక్కడి చేరుకుని ప్రభాకర్ ను వారించారు. అతడి భార్యను పిలిపించి మాట్లాడతామని హామీ ఇవ్వడంతో అతడు టవర్ పై నుంచి దిగివచ్చాడు. భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ప్రభాకర్ హేవీ విద్యుత్ టవర్ ఎక్కిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కుటుంబ కలహాలతో
జగిత్యాల జిల్లాకు చెందిన మేకల ప్రభాకర్, లావణ్యకు కొనేళ్ల క్రితం వివాహం అయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. లావణ్య పిల్లలతో కలిసి తన పుట్టింటి వద్దే ఉంటుంది. అయితే భార్య లావణ్య కాపురానికి రమ్మని కోరినా రావడంలేదని, ప్రభాకర్ విద్యుత్ టవల్ ఎక్కాడు. పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం చేయడం లేదని ప్రభాకర్ ఆరోపించారు. తన భార్య కాపురానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రభాకర్ బెదిరించాడు. దీంతో ధర్మపురి సీఐ రమణమూర్తి ప్రభాకర్ కు నచ్చజెప్పి విద్యుత్ టవర్ దిగేలా చేశారు. అనంతరం భార్యాభర్తలద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు.
భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య
భార్య పుట్టింటి నుంచి తిరిగి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త...తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కాపురానికి రమ్మని ఎంతగా సర్ది చెప్పినా ఆమె వినిపించుకోకపోడవంతో... అతడు మద్యానికి బానిస అయ్యాడు. చివరకు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఔరాయ జిల్లాలో జరిగింది. ఈ ఘటన వివరాలను యూపీ పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. యూపీకి చెందిన రాజేశ్(32) తరచూ మద్యం తాగేవాడు. భర్త మద్యం తాగడం అతడి భార్యకు నచ్చేది కాదు. మద్యం తాగడం మానేయాలని భర్త రాజేశ్‌ను పలుమార్లు సూచించింది. ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవల మొదలయ్యాయి. దీంతో రాజేశ్ భార్య ముగ్గురు పిల్లలను భర్త వద్దే వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రాజేశ్ తన భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఎన్నిసార్లు బతిమాలినా...ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్ మద్యాన్ని బానిసై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.