AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, సెప్టెంబర్ 7 వరకు వర్ష సూచన-imd report says up to september 7th andhra pradesh telangana many districts rain forecast ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Ts Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, సెప్టెంబర్ 7 వరకు వర్ష సూచన

AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, సెప్టెంబర్ 7 వరకు వర్ష సూచన

Bandaru Satyaprasad HT Telugu
Sep 02, 2023 08:53 PM IST

AP TS Rains : ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 7 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎల్లా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీ, తెలంగాణలో వర్షాలు
ఏపీ, తెలంగాణలో వర్షాలు

AP TS Rains : అప్పుడప్పుడూ అలా కనిపించి వెళ్తున్న వరుణుడి కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వెయ్యి కళ్లతో వేచిచూస్తున్నారు. వర్షాకాలంలో కూడా సూర్యుడు ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావారణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సెప్టెంబర్ 7 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.

సెప్టెంబర్ 7 వరకు

సెప్టెంబర్ 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్‌ 4 వరకు వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ఆవర్తనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రానున్న మూడ్రోజుల్లో

రానున్న మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, మహబూబాబాద్, జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీలో కూడా

దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుండి భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని చోట్ల బలమైన గాలులతో వర్షాలు పడి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య​, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

IPL_Entry_Point