Hyderabad Cold Alert : జనవరి 26 నుంచి మళ్లీ చలి పంజా.. ఆ ప్రాంతాల వాసులు జాగ్రత్త.. !
Hyderabad Cold Alert : హైదరాబాద్ లో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ... పలు జోన్లలో పొగ మంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Hyderabad Cold Alert : రాష్ట్రంలో నవంబర్ చివరి వారంలో మొదలయ్యే చలి వాతావరణం... సంక్రాంతి వచ్చే సమయానికి ప్రజల్ని గజగజ వణికిస్తుంది. పండుగ వెళ్లిపోయాక.. చలి నెమ్మదిగా తగ్గుతుంది. శివరాత్రి నాటికి పూర్తిగా తగ్గి... అప్పటి నుంచి రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలవుతుంది. అయితే.. గత రెండు మూడేళ్లుగా వాతావరణంలో... అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోతుండగా.. ఒక్కోసారి పెరుగుతున్నాయి. ఇలా ప్రజలు విభిన్న వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ.... భారత వాతావరణ శాఖ హైదరాబాదీలకు ఎల్లో అలర్జ్ జారీ చేసింది. జనవరి 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
జనవరి 26 నుంచి హైదరాబాద్ లో మరోసారి చలి పులి పంజా విసిరే అవకాశం ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల వరకు.... గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే... సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో జనవరి 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం పూట బయటికి వెళ్లే వారు, వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు తీసుకోవాలని... అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ తో పాటు.. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా గురువారం నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో జనవరి 25 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగుతోంది. పగటి పూట సాధారణ స్థాయిలో ఉంటోన్న ఉష్ణోగ్రతలు.. రాత్రి వేళ పడిపోతున్నాయి. దీంతో.. ప్రజలు వణుకుతున్నారు.
ఈ సీజన్ లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు జనవరి 9న నమోదయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో.. కనిష్ఠ ఉష్ణోగ్రత 6.5 డిగ్రీలుగా నమోదైంది. అదే రోజు.. సంగారెడ్డిలోని కోహిర్ లో ఉష్ణోగ్రతలు 4.6 డిగ్రీలకు పడిపోయాయి. సంగారెడ్డి, అసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 6 డిగ్రీల కంటే తక్కువే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.