Hyderabad News : హైదరాబాద్ లో విజృంభిస్తోన్న న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా వ్యాధులు-hyderabad unseasonal diseases pneumonia influenza spreading ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : హైదరాబాద్ లో విజృంభిస్తోన్న న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా వ్యాధులు

Hyderabad News : హైదరాబాద్ లో విజృంభిస్తోన్న న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా వ్యాధులు

HT Telugu Desk HT Telugu
Oct 18, 2023 08:46 PM IST

Hyderabad News : హైదరాబాద్ లో వాతావరణ మార్పు కారణంగా అన్ సీజనల్ డిసీజెస్ ప్రబలుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 1000 మంది వరకు న్యుమోనియా ,ఇన్ఫ్లుఎంజా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రులలో చేరారు.

హైదరాబాద్ లో ప్రబలుతున్న న్యుమోనియా
హైదరాబాద్ లో ప్రబలుతున్న న్యుమోనియా

Hyderabad News : హైదరాబాద్ నగరంలో న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచి నేటి వరకు ప్రతీరోజూ సుమారు 1000 మంది రోగులు న్యుమోనియా ,ఇన్ఫ్లుఎంజా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వీటితో పాటు కండ్ల కలక, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులు కూడా అదే స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటి కేసులు అధికంగా వస్తున్నాయని వైద్యులు తెలిపారు.

న్యుమోనియా కేసులు పాతబస్తీలోనే ఎక్కువ

అంతేకాకుండా న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా కేసులతో పాటు కొన్ని బ్యాక్టీరియల్ న్యుమోనియా కేసులు కూడా బయటపడుతున్నాయి. అయితే తీవ్ర దగ్గు ఈ వ్యాధి ముఖ్య లక్షణం. కాగా ఈ వ్యాధితో బాధపడే రోగులకు తప్పనిసరిగా ఆక్సిజన్ అవసరం ఉండడంతో నగరంలో అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడుతుంది. అయితే మొన్నటి వరకు నగరాన్ని అతలాకుతలం చేసిన డెంగీ కేసులు ఇప్పుడు టైఫాయిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. అయితే న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న వారిలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని నిలోఫార్ ఆస్పత్రి స్పెషలిస్ట్ డాక్టర్ దిషితా రెడ్డి అన్నారు. రోజు ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో 70 శాతం మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారని మిగతా వారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారని ఆమె తెలిపారు. అయితే వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి "అన్ సీజనల్ డిసీజెస్" వస్తున్నాయని డాక్టర్ దీషిత అన్నారు.

ప్రజలు కలుషిత నీరు తీసుకోవద్దు : వైద్యులు

పండగ సందర్భంగా ప్రజలంతా నగరం నుంచి పల్లెల బాట పడుతున్నారు. అయితే వారంతా తిరిగి నగరానికి వచ్చాక ఈ కేసులు అన్నీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. కాగా గాంధీ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సగటున 30 -32 న్యుమోనియా కేసులు, 20-25 ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. డెంగీ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. అయితే వాతావరణ మార్పు వల్ల ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని, ప్రజలు కలుషిత నీరు తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడితే ఇంట్లోనే వేడి నీళ్ళు, మందులు తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం వస్తే అంతా భయపడాల్సిన అవసరం లేదని వారం రోజులకు మించి అలానే ఉంటే అప్పుడు డాక్టర్ ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner