TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న అరెస్టులు, సిట్ అదుపులో మరో 19 మంది
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో 19 మందిని సిట్ అరెస్టు చేసింది. హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ కు పాల్పడిన రమేష్ ఇచ్చిన సమాచారం అరెస్టుల కొనసాగుతున్నాయి.
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరో 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నిందితుడు పోల రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసిన 19 మందిని సిట్ అరెస్టు చేసింది. పోటీ పరీక్షలో హైటెక్ రూట్ లో మాస్ కాపీయింగ్ చేయించిన పోల రమేష్ కు నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు విచారిస్తు్న్నారు. పోల రమేష్ అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్‌ను 30 మందికి అమ్మినట్లు సిట్ గుర్తించింది. ఈ సమాచారంతోనే మరో 19 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో ఈ కేసు ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 74కు చేరింది.
16వ ర్యాంకర్ అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజు అనే వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు.. పోల రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. పేపర్ ఇచ్చేందుకు పోల రమేష్‌కు రూ.30 లక్షలు ఇస్తానని నాగరాజు డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా కొంత డబ్బు చెల్లించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో నాగరాజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో అరెస్టైన రమేష్... ఫోన్‌లోని డేటా ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. రమేష్ ఇచ్చిన ఆధారాలతో నాగరాజు ఇంటికి వెళ్లిన పోలీసులు.... అతడిని ప్రశ్నించి అరెస్ట్ చేశారు.
హైటెక్ మాస్ కాపీయింగ్
పోల రమేష్ అభ్యర్థులకు పేపర్లు విక్రయించి... తనతో డీల్ చేసుకున్నవారికి ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో కలిసి హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేసి అభ్యర్థులకు ఆన్సర్స్ అందించాడు. ఇలా ఏడుగురు హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసినట్లు సిట్ గుర్తించింది. విచారణలో రమేష్ నుంచి ఇంకా చాలామంది ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. అభ్యర్థుల ఆర్థిక స్తోమతను బట్టి రమేష్ డబ్బులు వసూలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తాజాగా 19 మందిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.