TG DSC Apply : తెలంగాణ టెట్ పాసైన వారికి శుభవార్త, ఫ్రీగా డీఎస్సీ దరఖాస్తు
TG DSC Apply : తెలంగాణ టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి గుడ్ న్యూస్...వీరంతా డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది.
TG DSC Apply : తెలంగాణ టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల టెట్ పరీక్ష ఫీజు భారీగా పెంచారని విమర్శలు వచ్చాయి. అయితే టెట్ ఫీజు తగ్గించడం సాధ్యపడని కారణంగా డీఎస్సీ దరఖాస్తు ఫీజు మినహాయిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. టెట్ పాసైన అభ్యర్థులు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం డీఎస్సీ వెబ్ సైట్ https://tsdsc.aptonline.in/tsdsc/ లో మార్పులు చేసింది. అయితే టెట్ పాస్ కానివారు వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు
టెట్-2024 దరఖాస్తు ఫీజు రూ.1000, డీఎస్సీ దరఖాస్తు ఫీజు కూడా రూ. 1000 విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసింది. అయితే టెట్ ఫీజు భారీగా పెంచారని అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. దీంతో డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పటికే డీఎస్సీకి 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇకపై డీఎస్సీకి అప్లై చేసే అభ్యర్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఒక్కసారికి మాత్రమే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. టెట్ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు గాను బీసీలకు 75 మార్కులు, ఓసీలకు 90 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు వస్తే వారు ఉపాధ్యాయ పరీక్షలకు అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. వీరందరూ డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్
ఇటీవల తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తులకు సంబంధించి కొత్తగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను ఇచ్చింది. గతేడాది చివర్లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను(TS DSC Notification 2024) కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పోస్టుల సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11,062 ఖాళీలను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల సంఖ్య పెరగటంతో గతంలోనే వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అప్డేట్ చేసుకున్నారు.
జూన్ 17 నుంచి 31 వరకు పరీక్షలు
ఇటీవల టెట్ ఫలితాలు రావటంతో మరోసారి వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఓపెన్ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అప్లై చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
డీఎస్సీ పరీక్ష విధానం
డీఎస్సీ నోటిఫికేషన్ లో భర్తీ చేసే మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ 2024 పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 80 మార్కులకు 160 ప్రశ్నలు ఉంటాయి. గం.2.30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది.
సంబంధిత కథనం