Hyd Swiggy Customer: హైదరాబాదీ రికార్డ్... ఏడాదిలో రూ. 6 లక్షల ఇడ్లీల ఆర్డర్
Hyderabad Swiggy Customer Record: హైదరాబాద్ కు చెందిన ఓ స్విగ్గీ కస్టమర్ రికార్డ్ సృష్టించాడు. ఏడాది టైంలో రూ. 6 లక్షల విలువ చేసే ఇడ్లీలను బుక్ చేశాడు. ఈ మేరకు స్విగ్గీ పలు ఆసక్తికర విషయాలను పేర్కొంది.
Hyderabad Swiggy Customer Ordered Idli : ఏడాదిలో మీకు ఇష్టమైన ఆహారంపై ఎంత ఖర్చు చేస్తారు..? రూ. 50 వేలా..? రూ. 1 లక్షనా..? ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచన చేశారా..? కానీ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం... గడిచిన 12 నెలల్లో ఇడ్లీ కోసం రూ.6 లక్షలు వెచ్చించాడు. ఈ విషయం ఎలా బయటపడింది.? ఎవరు లెక్క కట్టారు..? వంటి డౌట్స్ రావొచ్చు. అయితే దీనికి ఓ లెక్క ఉందండోయ్...! ఈ విషయం ఎవరో చెప్పింది కాదు... ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ స్వయంగా ప్రకటించింది. ఆ లెక్కలెంటో చూస్తే....
దక్షిణాదిలో ఇడ్లీ చాలా పాపులర్ బ్రేక్‌ఫాస్ట్. రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మంది తీసుకుంటారు. అయితే హైదరాబాద్ కు చెందిన ఓ స్విగ్గీ కస్టమర్ మాత్రం... ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్డర్ చేశాడు. 12 నెలల కాలానికి ఏకంగా రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను కొనుగోలు చేసినట్లు స్విగ్గీ యాప్ ప్రకటించింది. మార్చి 30వ తేదీన ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా స్విగ్గీ యాప్ తన వార్షిక నివేదికను తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన కస్టమర్ గురించి ప్రస్తావించింది. అతను కేవలం హైదరాబాద్ లోకేషన్ నుంచి మాత్రమే కాకుండా... వేర్వురు ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
గత ఏడాది భారత్ లో స్విగ్గీ ద్వారా... దాదాపు 33 మిలియన్ ప్లేట్ల ఇడ్లీని ఆర్డర్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలానికి సంబంధించి అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపింది. ఎక్కవగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై , కోల్ కతా, ముంబై, కోయంబత్తూర్, పూణె, వైజాగ్ సిటీలలో అత్యధికంగా ఆర్డర్లు వచ్చినట్లు వివరించింది.
ఇడ్లీ ఆర్డర్ లో టాప్ 5 నగరాలు:
బెంగళూరు,
హైదరాబాద్,
చెన్నై,
ముంబై,
కోయంబత్తూరు
ఆర్డర్లు ఎక్కువగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలో అవుతున్నాయని పేర్కొంది స్విగ్గీ. మసాల దోశ తర్వాత...అత్యధికంగా బుకింగ్ చేసే బ్రేక్ ఫాస్ట్ జాబితాలో రెండో స్థానంలో ఇడ్లీ ఉందని తెలిపింది.
సంబంధిత కథనం