New Year Eve 2023: ఒక్కరోజులో స్విగ్గీ ఎన్ని లక్షల బిర్యానీలు డెలివరీ చేసిందంటే! మన బిర్యానీనే టాప్
New Year Eve 2023 - Swiggy Food Orders: న్యూఇయర్ వేడుక వేళ (December 31, 2022) స్విగ్గీకి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లక్షలాది బిర్యానీలను (Biryani) స్విగ్గీ డెలివరీ చేసింది. పిజ్జాలు, మసాల దోశలు కూడా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. స్విగ్గీ ఇన్‍స్టామార్ట్‌లో కండోమ్‍ల కోసం కూడా ఎక్కువ ఆర్డరే వచ్చాయని ఆ కంపెనీ వెల్లడించింది.
New Year Eve 2023 - Swiggy Food Orders: కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా సాధారణంగా చాలా మంది ప్రజలు ఫుడ్ డెలివరీ యాప్స్‌లో చాలా ఆర్డర్స్ పెడుతుంటారు. తమకు ఇష్టమైన రకరకాల ఫుడ్ ఐటెమ్‍లను ఎంజాయ్ చేస్తారు. ఇళ్లయినా, హౌస్ పార్టీలైనా ఫుడ్‍ను ఆర్డర్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. దీంతో డిసెంబర్ 31 వచ్చిందంటే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) లాంటి ఫుడ్ డెలివరీ సర్వీస్‍లు ఫుల్ గిరాకీ ఉంటుంది. లక్షల కొద్దీ ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. 2022కు వీడ్కోలు చెబుతున్న తరుణంలో డిసెంబర్ 31న స్విగ్గీకి లక్షలాది ఆర్డర్లు వచ్చాయి. గతంలాగే అందులో బిర్యానీ (Biryani)లదే హవా. అయితే ఈసారి కిచిడీ కూడా ఎక్కువ ఆదరణ పొందడం ప్రత్యేకతగా ఉంది. పూర్తి వివరాలు ఇవే.
3.5లక్షల బిర్యానీలు
New Year Celebrations: డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా 3.5లక్షలకు పైగా బిర్యానీలు డెలివరీ చేసినట్టు స్విగ్గీ ఆదివారం వెల్లడించింది. ఇందులో మన హైదరాబాదీ బిర్యానీ (Hyderabad Biryani)నే టాప్‍లో నిలిచింది. తాము నిర్వహించిన పోల్ ప్రకారం 75.4 శాతం మంది హైదరాబాదీ బిర్యానీనే ఆర్డర్ చేశారని తేలిందని స్విగ్గీ వెల్లడించింది. 14.2 శాతంతో లక్నోయి బిర్యానీ ఆ తర్వాత ఉంది. 10.4 శాతంతో కోల్‍కతా బిర్యానీ మూడో ప్లేస్‍లో నిలిచింది. మొత్తంగా స్విగ్గీలో ఈ ఏడాది డిసెంబర్ 31న కూడా అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లే వచ్చాయి. హైదరాబాదీ బిర్యానీ దేశవ్యాప్తంగా చాలా పాపురల్.
హైదరాబాద్‍లో ఎక్కువ బిర్యానీలు బావర్చీ రెస్టారెంట్ విక్రయించిందని స్విగ్గీ పేర్కొంది. డిసెంబర్ 31న ఆ రెస్టారెంట్‍కు సగటున నిమిషానికి రెండు ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. డిమాండ్ మేర బావర్చీ.. సుమారు 15 టన్నుల బిర్యానీని తయారు చేసిందని వెల్లడించింది.
మరోవైపు, డిసెంబర్ 31న రాత్రి 7 గంటల సమయానికే.. దేశవ్యాప్తంగా 61వేల పిజ్జాలను డెలివరీ చేసినట్టు స్విగ్గీ చెప్పింది. ఇందులో డొమినోస్‍దే పైచేయిగా ఉంది.
ఈ డిసెంబర్ 31 కిచిడీకి కూడా మంచి డిమాండ్ కనిపించింది. రాత్రి 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 12,344 మంది కిచిడీ కోసం ఆర్డర్లు ఇచ్చారని స్విగ్గీ వెల్లడించింది. సింపుల్‍గా, ఆరోగ్యకరంగా ఉండే కిచిడీని కూడా ఈసారి బాగానే ఎంపిక చేసుకున్నారు యూజర్లు. ఇక మసాలా దోశకు కూడా మంచి డిమాండ్ కనిపిచిందని స్విగ్గీ చెప్పింది.
మరోవైపు స్విగ్గీ ఇన్‍స్టామార్ట్ నుంచి 1.76లక్షల చిప్స్ ప్యాకెట్ల కోసం ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. అలాగే కండోమ్స్ కోసం 4,212 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది.