NIMS Hyd: నిమ్స్‌లో 2 వేల పడకలతో కొత్త బిల్డింగ్.. త్వరలోనే శంకుస్థాపన
NIMS Hyderabad : నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా 2 వేల పడకలతో కొత్త బిల్డింగ్ ను నిర్మించనున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Hyderabad NIMS Hospital Expansion : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు ఇచ్చారు. 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారని ప్రకటించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
మంత్రి హరీశ్ రావు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు. భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని... నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ దవాఖానలతోపాటు నిమ్స్ విస్తరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.
దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్...
గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పనులను వేగవంతం చేయాలన్నారు. నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలన్నారు. ఎంఎన్‌జే దవాఖానలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.