PM SHRI Schools: NEP అమలులో మరో ముందడుగు.. తెలంగాణలోని 543 బడులు ఎంపిక-543 telangana govt schools selected under pm shri schools scheme in frst phase ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Shri Schools: Nep అమలులో మరో ముందడుగు.. తెలంగాణలోని 543 బడులు ఎంపిక

PM SHRI Schools: NEP అమలులో మరో ముందడుగు.. తెలంగాణలోని 543 బడులు ఎంపిక

HT Telugu Desk HT Telugu
May 03, 2023 06:31 PM IST

National Education Policy of India 2020: నూతన జాతీయ విద్యావిధానం(NEP-2020) అమలులో మరో అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మొదటి విడతగా తెలంగాణ నుంచి 543 పీఎం శ్రీ స్కూళ్లను ఎంపిక చేసింది.

పీఎం-శ్రీ పాఠశాలలు
పీఎం-శ్రీ పాఠశాలలు

PM SHRI Schools Scheme Updates: జాతీయ విద్యావిధానం (NEP-2020) అమలుకు ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర, ప్రత్యేకమైన కార్యాచరణతో అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ ప్రపోజల్స్ పంపించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా తెలంగాణ నుంచి 543 పీఎం శ్రీ స్కూళ్లను కేంద్రం ఎంపిక చేసింది.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ‘పీఎం-శ్రీ ’లో భాగంగా.. NEP అమలులో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మొదటి విడతలో ఈ పాఠశాలను ఎంపిక చేసింది. వీటి ద్వారా సమగ్రమైన, వినూత్నమైన విధానాల్లో, సృజనాత్మకతను ప్రోత్సహించేలా, అన్ని స్థాయిల్లో అందరు విద్యార్థులకు సమానమైన, నాణ్యమైన విద్యనందిస్తూ.. సంపూర్ణమైన పరివర్తన తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకెళ్తోంది. ఈ పథకానికి 7 సెప్టెంబర్, 2022 నాడు కేంద్ర కేబినెట్ ఈ పీఎం-శ్రీ పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ పీఎం-శ్రీ పాఠశాలల ఎంపిక చాలా పారదర్శకంగా చేపట్టిన కేంద్రం.. పాఠశాలలు పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటి ఆధారంగా చాలెంజ్ ‌ మోడ్‌లో వీటిని ఎంపిక చేసింది. మొత్తం మూడు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. UDISE+ కోడ్ ఉన్నటువంటి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక స్వయం నిర్వహణ పాఠశాలలు పీఎం-శ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రాష్ట్రాలు.. తమ పరిధిలో ఎంపికయ్యే పాఠశాలల్లో NEP-2020ని అమలు చేసేందుకు, ఈ ప్రయాణంలో సంపూర్ణంగా సహకరించేందుకు కేంద్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.

తెలంగాణ నుంచి మొదటి విడత పీఎం-శ్రీలో చోటు దక్కించుకున్న పాఠశాలల్లో 56 ఎలిమెంటరీ పాఠశాలలు కాగా, 487 సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలున్నాయి. ఇందుకు సంబంధించి.. ఈ 543 పాఠశాలల్లో NEPని సమర్థవంతంగా అమలు చేసేందుకు.. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) సమావేశాలకోసం వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ ప్రపోజల్స్ ను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ పథకంలో భాగంగా ఇచ్చే నిధులను నిర్వహించేందుకు ప్రత్యేకంగా సింగల్ నోడల్ ఏజెన్సీ (SNA) ను కూడా ఏర్పాటుచేయాలని కోరింది.

ఎంపికైన పాఠశాలలు
ఎంపికైన పాఠశాలలు

ఈ పీఎం-శ్రీ పాఠశాలలు.. దేశంలో నాణ్యమైన విద్య విషయంలో ఓ బ్రాండ్ గా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ పాఠశాలల ద్వారా సాధించే ఫలితాలనేవి.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సహకరించడంపై ఆధారపడి ఉండనుంది.

Whats_app_banner