TSRTC Free Travel : ఒరిజినల్ కార్డు తప్పనిసరి, ఫోన్ లో చూపిస్తే చెల్లదు- మహిళల ఉచిత ప్రయాణాలపై టీఎస్ఆర్టీసీ కీలక సూచనలు
TSRTC Free Travel : మహిళల ఉచిత ప్రయాణాలపై టీఎస్ఆర్టీసీ పలు కీలక సూచనలు చేసింది. ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి ప్రకటించింది. గుర్తింపు కార్డుపై ఫొటో, అడ్రస్ స్పష్టం కనిపించాలని పేర్కొంది. జీరో టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.
TSRTC Free Travel : ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పలు సూచనలు చేసింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలిపింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందన్నారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా......ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని పేర్కొంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని టీఎస్ఆర్టీసీ కోరింది.
జీరో టికెట్ తప్పనిసరి
"ప్రయాణం ఉచితమే కదా, జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే, సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కాబట్టి ప్రతి మహిళా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం" -టీఎస్ఆర్టీసీ
సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈనెల 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను ఇన్ ఛార్జ్ లుగా నియమించామన్నారు.
రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఇన్ ఛార్జ్ లు అందుబాటులో ఉంచుతారని సజ్జనార్ వివరించారు. సంక్రాంతికి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని సూచించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా