TS Mlas Criminal Cases : కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
TS Mlas Criminal Cases : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది.
TS Mlas Criminal Cases : తెలంగాణలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఆ 80 మందిలో 16 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ఉద్యమం, మోడల్ కోడ్ నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రకటించింది.
64 మందిలో 50 మందిపై క్రిమినల్ కేసులు
కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 39 ఎమ్మెల్యేలలో 19 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన 8 మందిలో ఏడుగురిపై నేర చరిత్ర ఉంది. ఎంఐఎం పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక పక్క రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా, పార్టీలు మాత్రం గెలుపే ప్రమాణంగా తీసుకుంటున్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ అధ్యక్షుడు ఎం.పద్మనాభ రెడ్డి తెలిపారు. గత నెలలో ఎమ్మెల్యే అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించింది ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్. మొత్తం 226 మంది ప్రధాన పార్టీల నామినిలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని సంస్థ ఇటీవలే గుర్తించింది.
రేవంత్ రెడ్డి, రాజా సింగ్ లపై 89 క్రిమినల్ కేసులు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. తరువాత ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుపై 52 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావుపై 32, హ్యాట్రిక్ విజయం సాధించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై 89 కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ద్వేశ పూరిత ప్రసంగాలు చెయ్యడం వల్ల ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్ పై 10 క్రిమినల్ కేసులు, గజ్వేల్ నుంచి ఎన్నికైన కేసీఆర్ పై 9, సిరిసిల్ల నుంచి రెండోసారి ఎన్నికైన కేటీఆర్ పై 8 అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై 6 కేసులు ఉన్నాయి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్