TS Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్, ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ!-hyderabad news in telugu new ration card application starts from december 28th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్, ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ!

TS Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్, ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ!

Bandaru Satyaprasad HT Telugu
Dec 19, 2023 03:10 PM IST

TS Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధం అవుతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

రేషన్ కార్డులు
రేషన్ కార్డులు

TS Ration Cards : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించనుంది. వీటితో పాటు రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు, తప్పులు సరిచేయడంపై దరఖాస్తులు స్వీకరించనున్నారని కీలక సమాచారం. ఈ నెల 28 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీంతో పాటు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 28 నుంచి దరఖాస్తులు?

సోమవారం నాంపల్లిలోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో కొత్త రేషన్ కార్డుల అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తామని, లబ్దిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణలో గత ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం లేకపోయింది.

రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు

గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ తో పాటు ఆరోగ్య శ్రీ సేవలకు ఈ కార్డు తప్పనిసరి. కొత్తగా రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులైన వారికి ఆయా సేవలు అందడంలేదన్న విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీపై కసరత్తు ప్రారంభం అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి- కలెక్టర్ల సమీక్షలో ఆదేశాలు!

సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ, కార్డుల్లో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పొందడానికి రేషన్‌ కార్డును అర్హతగా చూస్తారు. 2018లో రేషన్ కార్డుల్లో మార్పులకు అవకాశం కల్పించినా... ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. పిల్లలు, కొత్త కోడళ్లు, వలస వెళ్లిన వారిని కార్డుల్లో యాడ్ చేసుకునేందుకు అవకాశం లేకపోయింది. ఆహార భద్రత కార్డు ఉంటే బియ్యం రావడంతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తించేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం నిర్ణయంపై పేదలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

Whats_app_banner