Manda Krishna Madiga : ప్రధాని ఆలింగనంతో కంటతడి పెట్టుకున్న మందకృష్ణ, ఓదార్చిన మోదీ
Manda Krishna Madiga : సికింద్రాబాద్ లో జరిగిన మాదిగల ఉపకులాల సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సభకు హాజరైన ప్రధాని మోదీ మందకృష్ణను హత్తుకున్నారు. దీంతో ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
Manda Krishna Madiga : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగల ఉపకులాల విశ్వరూప సభను నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే విశ్వరూప మహాసభలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవ్వంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ చేయిపట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. వేదికపైనే మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఆలింగనం చేసుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా మోదీ నినాదాలు హోరెత్తాయి. మోదీ హత్తుకోవడంతో మందకృష్ణ మాదిక కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో ప్రధాని మోదీ తన పక్కనే మంద కృష్ణ మాదిగను కూర్చోబెట్టుకుని ఓదార్చారు. అతని భుజంపై చేయి మంద కృష్ణ మాదిగకు ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ తనకు ఇచ్చిన గౌరవం, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చూసి మందకృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు.
మోదీ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు
అనంతరం సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ...దేశాన్ని కాపాడే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో ప్రధాని మోదీని మించిన నాయకుడు లేరన్నారు. మోదీ మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. మాదిగ ఉపకులాల సభకు హాజరైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మాదిగల సభకు ప్రధాని మోదీ వస్తారని తాము ఊహించలేదని మందకృష్ణ అన్నారు. ఈ సమాజం పశువుల కంటే హీనంగా మమ్మల్ని చూసిందన్నారు. ఇప్పుడిప్పుడే మాదిగలు చైతన్యవంతులు అవుతున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం మాటలే చెబుతున్నాయన్న ఆయన... బీజేపీతోనే మాదిగల ఆకాంక్షలు నెరవేరుతాన్నారు. బీజేపీ ఎప్పుడూ బలహీనవర్గాలకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది బీజేపీ మాత్రనే అన్నారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మందకృష్ణ అన్నారు.
ఒక్క మాదిగ మంత్రి లేరు
ప్రధాని మోదీ సామాజిక న్యాయాన్ని నమ్ముతారని, అందుకే మాదిగల మీటింగ్ కు వచ్చారని మందకృష్ణ అన్నారు. బీసీల కన్నా అట్టడుగున ఉన్న దళితుల్ని రాష్ట్రపతిని చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత గిరిజనుల్ని కూడా రాష్ట్రపతి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన వారిలో తాను ఒకడినని, అయితే అధికారం వచ్చాక కేసీఆర్ మాదిగలను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రి కూడా లేరన్నారు. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్కశాతం ఉన్న వెలమ సామాజికవర్గానికే మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు.