Hyderabad RRR : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్, జాతీయ రహదారిగా ప్రకటనకు ప్రతిపాదనలు
Hyderabad RRR : రీజినల్ రింగ్ రోడ్డు సథరన్ పార్ట్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ను జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను గడ్కరీ ఆదేశించారు.
Hyderabad RRR : రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సీఎం రేవంత్ రెడ్డిజాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్నిజాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల(National Highways) విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు. ఆయా రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
యుటిలిటీస్ వ్యయంపై ప్రతిష్టంభన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో మంగళవారం మధ్యాహ్నం కలిశారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల పనులకు సంబంధించిన వివిధ సమస్యలను రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. తొలుత రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్తరన్ పార్ట్ చౌటుప్పల్-భువనగిరి-తుఫ్రాన్-సంగారెడ్డి-కంది పరిధిలో యుటిలిటీస్ (కరెంటు స్తంభాలు, భవనాల తదితరాలు) తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబనపై చర్చసాగింది. యుటిలిటిస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పది నెలల క్రితం ఎన్‌హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంబన నెలకొంది.
యుటిలిటీస్ వ్యయం కేంద్రానిదే
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు అంగీకరిస్తూ ఎన్‌హెచ్ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టినదెవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్‌లో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని సీఎంకి కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి సూచించారు.
జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం కోరిన రహదారుల వివరాలు
1.మరికల్-నారాయణపేట్-రామసముద్ర-63 కి.మీ.
2.పెద్దపల్లి-కాటారం-66 కి.మీ
3.పుల్లూర్-అలంపూర్-జటప్రోలు-పెంట్లవెల్లి-కొల్లాపూర్-లింగాల్-అచ్చంపేట-డిండి-దేవరకొండ-మల్లేపల్లి-నల్గొండ-225 కి.మీ.
4.వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం-110 కి.మీ.
5.మన్నెగూడ-వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్-134 కి.మీ.
6.కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం-165 కి.మీ.
7.ఎర్రవెల్లి క్రాస్ రోడ్-గద్వాల-రాయచూర్-67 కి.మీ.
8.జగిత్యాల-పెద్దపల్లి-కాల్వ శ్రీరాంపూర్-కిష్టంపేట-కల్వపల్లి-మోరంచపల్లి-రామప్ప దేవాలయం-జంగాలపల్లి-164 కి.మీ
9.సారపాక-ఏటూరునాగారం-93 కి.మీ
10.దుద్దెడ-కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి క్రాస్‌రోడ్-63 కి.మీ.
11.జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం-100 కి.మీ.
12.సిరిసిల్ల-వేములవాడ-కోరుట్ల-65 కి.మీ
13.భూత్పూర్-నాగర్‌కర్నూల్-మన్ననూర్-మద్దిమడుగు (తెలంగాణ)-గంగలకుంట-సిరిగిరిపాడు-166 కి.మీ.
14.కరీంనగర్-రాయపట్నం-60 కి.మీ
సంబంధిత కథనం