Hyderabad City Police : 'మీది మొత్తం వెయ్యి, ఛార్జెస్ ఎక్స్ ట్రా'- కుమారి ఆంటీ డైలాగ్ తో వాహదారుడికి సిటీ పోలీసులు ఝలక్
Hyderabad City Police : సోషల్ మీడియా సెన్సెషన్ కుమారి ఆంటీ డైలాగ్ తో హైదరాబాద్ సిటీ పోలీసులు వాహనదారులను అలర్ట్ చేశారు. నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తు్న్న వాహనదారుడికి ఝలక్ ఇచ్చారు.
Hyderabad City Police : హైదరాబాద్ సిటీ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ట్రెండింగ్ అంశాలతో అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాలు, వాహనదారుల నిర్లక్ష్యంపై అలర్ట్ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సెన్సెషన్ క్రియేట్ చేసిన డైలాగ్ "మీది మొత్తం వెయ్యి అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా". గచ్చిబౌలిలో భోజన హోటల్ నడుపుతున్న కుమారి ఆంటీ(Kumari Aunty) డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేశారు కుమారి. హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఈ డైలాగ్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులను అలర్ట్ చేశారు.
వాహనదారుడికి కుమారి ఆంటీ డైలాగ్
హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న ఓ వాహనదారుడి ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్ గా " మీది మొత్తం వెయ్యి అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా" అంటూ ట్వీట్ చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం, ట్రాఫిక్ నియమాలను పాటించండి, సేఫ్ డ్రైవింగ్ చేయండని పోలీసులు యాష్ ట్యాగ్ లు జోడించారు. సిటీ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ మోసాలపై అవగాహన
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు తీవ్రంగా ఉన్నాయి. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై హైదరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయామని గమనిస్తే...ఆలస్యం చేయకుండా బాధితులు ఏం చేయాలో పోలీసులు తెలిపారు. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు గోల్డెన్ అవర్ పై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు రోజులో కోటి రూపాయలు దోచేస్తున్నారని సమాచారం. 2023లో సైబర్ మోసాలతో బాధితులు రూ.140 కోట్ల వరకు నష్టపోగా...వీటిలో రూ.44 కోట్లు పోలీసులు బ్యాంకు అధికారుల సాయంతో ఫ్రీజ్ చేశారు. వీటిలో కేవలం రూ.2 కోట్లలోపు బాధితులకు తిరిగి అందజేయగలిగినట్లు తెలుస్తోంది.
అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు పొందాలనే ఆలోచనలో చాలా సులభంగా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. అయితే బాధితులు తాము మోసపోయామని గ్రహించిన 2 గంటల్లోపు (Golden Hour)కు సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ ను తెలియజేయాలి. సైబర్ నేరాల్లో తొలి రెండు గంటలు చాలా కీలకమని పోలీసులు అంటున్నారు. నేరస్థుడి అకౌంట్ ను ఫ్రీజ్ చేసి డబ్బు రికవరీ చేసేందుకు ఈ గోల్డెన్ అవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. ఇటీవల పార్ట్‌టైమ్ జాబ్స్, ఆన్ లైన్ ట్రేడింగ్, కొరియర్ సేవల పేరిట మోసాలు పెరిగాయి. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డీప్ ఫేక్ ఆర్టిఫిషియ్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో కూడా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం