Hyderabad News : అల్వాల్ గ్రిల్ హౌస్ హోటల్ లో ఫుడ్ పాయిజన్, షావర్మాతో మయోనైజ్ తిన్న 17 మందికి అస్వస్థత
Hyderabad News : హైదరాబాద్ లోని అల్వాల్ లోని ఓ హోటల్ షావర్మాతో మయోనైజ్ తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జీవీఎంసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Hyderabad News : హైదరాబాద్ లోని అల్వాల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. లోతుకుంట గ్రిల్ హౌస్ హోటల్ లో షావర్మాతో పాటు మయోనైజ్ తిన్న 17 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు బాధితులు మాత్రమే ఉండగా మంగళవారం రాత్రికి ఆ సంఖ్య 17కు చేరింది. బాధితుల ఫిర్యాదుతో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అల్వాల్ ఇన్స్ పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు.
అసలేం జరిగింది?
లోతుకుంట పరిధిలోని గ్రిల్ హౌస్ హోటల్లో ఈ నెల 13న 17 మంది మయోనైజ్ తో పాటు షావర్మా తిన్నారు. తిన్న తర్వాత కాసేపటికి అందులో 4గురు బాధితులు అస్వస్థతకు గురయ్యారు. వారు సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా... మంగళవారం రోజున మరో 13 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై కాంటినెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ లో చేరిన 13 మంది ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని ఆసుపత్రిలోని వైద్యులు బాధితులకు రక్త పరీక్ష నిర్వహించిన అనంతరం వెల్లడించారు. వీరితో పాటు సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కూడా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. బాధితుల రక్తంలో హానికర సల్మానెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వైద్య నివేదిక ఆధారంగా బాధితుల కలుషిత ఆహారంతోనే అస్వస్థకు గురైనట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు గ్రిల్ హౌస్ హోటల్ నిర్వాహకుడు తౌఫిక్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితులను అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరామర్శించారు.
శుభ్రత పాటించని సిబ్బంది
సాధారణంగా గుడ్డులోని పచ్చ సొన, నిమ్మరసం, నూనెతో ఈ మయోనైజ్ తయారు చేస్తారు. తయారు చేసే క్రమంలో హోటల్ సిబ్బంది శుభ్రత పాటించలేదు. అందువల్లే బాధితులు అస్వస్థతకు గురై ఉంటారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శుభ్రత పాటించి తయారు చేసినా....నాలుగు గంటల్లోపే దాని తినెయ్యాలని లేదంటే మయోనైజ్ విషమంగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డిని ఈ ఘటనకు సంబంధించిన వివరణ కోరగా ......మయోనైజ్ వల్ల ప్రతీ నెల చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటల్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా