Hyderabad News : ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం-hyderabad nampally media academy new building ready cm kcr opens ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

Hyderabad News : ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

Bandaru Satyaprasad HT Telugu
Jul 25, 2023 07:03 PM IST

Hyderabad News : నాంపల్లిలో కొత్తగా నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 2017లో నూతన భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు విడుదల చేశారు.

మీడియా అకాడమీ భవనం
మీడియా అకాడమీ భవనం

Hyderabad News : హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసిఆర్ ను మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆమోదం కోసం చూస్తున్నారు. పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని ఆయన సూచించారు. ఆ మేరకు 2017లో భవన నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేశారు. ఈ భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు... , రెండు అంతస్తుల్లో 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, ఛైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది.

ఇటీవల మీడియా అకాడమీ భవన నిర్మాణం పూర్తయిన సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి తదితర అధికారులు అకాడమీ భవన నిర్మాణాన్ని పర్యవేక్షించారు. భవనం పనులన్నీ తుదిదశకు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దవలసిందిగా ఆర్ అండ్ బి అధికారులను కోరారు. నగరం నడిబొడ్డున మీడియా అకాడమీకి కార్పొరేట్ స్థాయి సొంత భవనం సిద్ధమయింది. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, అశోక్ రెడ్డి ఇంజినీర్లకు కొన్ని సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకుంటామని అల్లం నారాయణ తెలిపారు.

IPL_Entry_Point