Hyderabad Airport : హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మరో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు
Hyderabad Airport : హైదరాబాద్ ఎయిర్ పోర్టు మరో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సీఐఐ దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు కైవసం చేసుకుంది.
Hyderabad Airport : హైదరాబాద్ విమానాశ్రయం మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. " నేషనల్ ఎనర్జీ లీడర్ " , " ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ " అవార్డులను కైవసం చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు స్థిరమైన, శక్తి పరిరక్షణ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంస్థ నిపుణులు వెల్లడించారు. వినూత్న కార్యక్రమాల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి నిరంతర కృషి చేస్తున్నట్టుగా నిపుణులు గుర్తించి ఈ అవార్డును అందచేస్తున్నట్టు ప్రకటించారు.
రెండు అవార్డులు
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన "ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ " 24వ జాతీయ అవార్డుల వేడుకల్లో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రతిష్టాత్మక " నేషనల్ ఎనర్జీ లీడర్ ", " ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ " అవార్డులను కైవసం చేసుకుంది.ఈ విమానాశ్రయం వరుసగా అయిదు సార్లు అవార్డులు దక్కగా 7వ ఏడాది కూడా '' నేషనల్ ఎనర్జీ లీడర్ '', 'ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్' అవార్డులతో గుర్తింపు పొందింది.
2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ... శంషాబాద్ ఎయిర్ పోర్టు ఇంధన సమర్ధత, స్థిరమైన కార్యక్రమాలను అవలంబించడంలో ముందంజలో ఉందన్నారు. ఒక సంస్థగా పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి తగిన కార్యాచరణ చేపట్టి, సామర్థ్యాలను ఆప్టిమైజ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సమర్థవంతమైన సాంకేతికతలలో పెట్టుబడి పెడుతున్నామని, 2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పర్యావరణాన్ని సంరక్షించుకునేందుకు తాము ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రదీప్ వెల్లడించారు. నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డు సుస్థిర భవిష్యత్తు పట్ల శంషాబాద్ ఎయిర్ పోర్టు నిబద్ధతకు నిదర్శనం అని కొనియాడారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్