Hyderabad Crime : ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య-విలేకరుల వేధింపులే కారణం!-hyderabad father killed three sons committed suicide police filed case on five news reporters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య-విలేకరుల వేధింపులే కారణం!

Hyderabad Crime : ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య-విలేకరుల వేధింపులే కారణం!

Bandaru Satyaprasad HT Telugu
Mar 13, 2024 08:34 PM IST

Hyderabad Crime : ముగ్గురు కొడుకులకు ఉరి వేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో సంచలనం అయింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజీ మనీ స్కీమ్ డబ్బులు పెట్టి మోసపోయిన వ్యక్తిని బెదిరించి చివరికి ప్రాణం తీసుకునేలా చేశారు ఐదుగురు విలేకరులు.

ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య కేసులో నిందితులు
ముగ్గురు కొడుకుల ప్రాణం తీసి, తండ్రి ఆత్మహత్య కేసులో నిందితులు

Hyderabad Crime : తెలంగాణలో సంచలనం రేపిన ముగ్గురు కొడుకులను హత్య చేసి తండ్రి ఆత్మహత్య (Father Killed Three sons)చేసుకున్న కేసులో సంచనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఐదుగురి విలేకరులను నిందితులుగా చేర్చారు. మార్చి 3వ తేదీ రాత్రి రంగారెడ్డి జిల్లా టంగుటూర్ గ్రామంలో నీరటి రవి తన ఇంటిలో తన ముగ్గురు కొడుకులకు మెడకు తాడుతో ఉరి వేసి హత్య చేశాడు. అనంతరం తాను కొత్తగా కట్టుకున్న ఫంక్షన్ హాల్ దగ్గరున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య నీరటి శ్రీలత ఫిర్యాదుతో మోకిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగింది?

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీరటి రవి జుల్కల్ లోని అగ్రికల్చర్ ఆఫీస్ లో సూపర్ వైజర్ గా పనిచేసే సమయంలో(2002) కంపెనీ పని మీద గుంటూరు(Guntur)కి వెళ్లేవారు. అక్కడ రవికి తిరుపతిరావ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు విజయనగరానికి చెందిన GSN ఫౌండేషన్ మనిసర్కులేషన్ స్కీమ్(Money Circulation Scheme) గురించి వివరించి రవిని దాంట్లో మెంబర్ గా చేర్పించాడు. GSN ఫౌండేషన్ లో ముందు రూ.2000 కడితే 45 రోజుల తరువాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చారు. ఆ తరువాత ప్రతి నెల రూ.1000చొప్పున ఆరు నెలల వరకు ఇచ్చేవారు. ఈ విషయాన్ని రవి డిసెంబర్ 2022లో తన ఊరి వారితో, తనకు పరిచయమున్న వారితో చెప్పి GSN ఫౌండేషన్ లో పెద్ద మొత్తంలో డబ్బులను కట్టించాడు. రవి GSN పౌండేషన్ తరపున సేకరించిన డబ్బును తిరుపతిరావుకు పంపేవాడు. తిరిగి తిరుపతిరావు నెలనెల డబ్బులను రవికి పంపగా రవి సభ్యులకు చెల్లించేవాడు. కొంతకాలం ఈ వ్యాపారం బాగానే నడిచింది. దీంతో ఎనిమిది నెలల కిందటి రవి తన గ్రామానికి చెందిన నాగాళ్ల శేఖర్, సుధాకర్ వద్ద 0.39 గుంటల భూమిని కొనుగోలు చేసి S.M.U. ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు.

విలేకరులు రూ.20 లక్షలు డిమాండ్

అయితే గత మూడు నెలల నుంచి GSN ఫౌండేషన్ నుంచి తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో రవిని గ్రామస్థులు, తన మిత్రులు డబ్బుల గురించి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ విషయం బయటతెలియడంతో ఏబీఎన్ విలేకరి శ్రీను, ఈనాడు విలేకరి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ విలేకరి మహేశ్, సాక్షి విలేకరి ప్రవీణ్, వార్తా విలేకరి శ్రీనివాస్ రెడ్డి రవిని బెదిరించారు. GSN ఫౌండేషన్ పేరు మీద పబ్లిక్ దగ్గర డబ్బులు కట్టించి మోసం చేశావని, ప్రభుత్వ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టుకున్నావని న్యూస్ పేపర్లలో రాస్తామని రవిని బెదిరించారు. రూ.20 లక్షలు ఇస్తే న్యూస్ పేపర్లలో రాయమని బ్లాక్ మెల్ చేశారు. దీంతో రవి ఈ ఏడాది ఫిబ్రవరి 19న తన భార్య బంగారు పూస్తేలతాడు, నల్లపూసలదండ తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు విలేకర్లకు ఇచ్చాడు. శంకర్ పల్లిలో ఉన్న నాగరాజు, అతని భార్య పేరు మీద జీఎస్ఎన్ సంస్థలో డబ్బులు పెట్టడంతో వారు కూడా డబ్బుల తిరిగి ఇవ్వమని రవిని ఒత్తిడి చేశారు. దీంతో రవి తన భార్య పేరున రావులపల్లిలో ఉన్న రెండు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ లను తాకట్టు పెట్టి రూ.18 లక్షలు నాగారాజుకు ఇచ్చాడు. విలేకరులు మిగతా డబ్బుల గురించి రవిని ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన పిల్లలు అనాథలు అవుతారని భావించి మార్చి 3వ తేదీ రాత్రి ముగ్గురు కొడుకులకు ఉరి వేసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకొని చనిపోయాడు.

మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... ఐదుగురు విలేకరులు, ఒక హోం గార్డుపై కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో నిందితులు

  • ఏ1 - తిరుపతి రావు
  • ఏ2 - మంగలి శ్రీనివాస్ - ఆంధ్రజ్యోతి రిపోర్టర్
  • ఏ3 - కురుమ శ్రీనివాస్ - ఈనాడు రిపోర్టర్
  • ఏ4 - వడ్డే మహేష్ - నమస్తే తెలంగాణ రిపోర్టర్
  • ఏ5 - సిరిపురం శ్రీనివాస్ రెడ్డి - వార్తా పేపర్ రిపోర్టర్
  • ఏ6 - సంకే ప్రవీణ్ కుమార్ - సాక్షి రిపోర్టర్
  • ఏ7 - ఆలూరు రాజు
  • ఏ8 - మనీలా
  • ఏ9 - రామకృష్ణ

విలేకర్లు కానీ, ఇతర వ్యక్తులు ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినా, చేయడానికి ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగి ఏసీపీ హెచ్చరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం