1 Crore Seized Hyd: మునుగోడుకు తరలిస్తున్న రూ. కోటి నగదు పట్టివేత
Munugodu Bypoll 2022: మునుగోడుకు తరలిస్తున్న రూ.కోటి నగదు పట్టుబడింది. కోకాపేట నుంచి నార్సింగ్ వైపు తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
Police seize ₹1 crore in Hyderabad: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఈ తరహా ఘటనలు వెలుగుచూడగా... శనివారం హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో తరలిస్తున్న రూ. కోటి నగదును సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఏం జరిగిందంటే...
కోకాపేట వైపు నుంచి నార్సింగి దిశగా వస్తున్న కొన్ని వాహనాల్లో ఉన్నవారు వాహనాల తనిఖీని గమినించి తప్పించుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. తనిఖీ చేయగా 2 కార్లలో, బైక్‌పై బ్యాగుల్లో నగదు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. డబ్బుకి సంబంధించి వివరాలు చెప్పలేదు. కందికోటు దేవల్‌రాజు, దాసర్ లూథర్ అలియాస్ దాసర్ కుమార్‌ల నుంచి రూ.35లక్షల ఉన్న బ్యాగు, కార్వాన్ కు చెందిన జి.శ్రీకాంత్‌సాగర్, ఫిలింనగర్‌కు చెందిన నగేశ్‌ల నుంచి రూ.35లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న గుండాల కుమార్ నుంచి రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే డబ్బు మొత్తాన్ని విభజించి తరలించే యత్నం చేసినట్లు వారు వెల్లడించారు. మరింత విచారించగా ఈ నగదంతా కోమటిరెడ్డి సుమంత్‌రెడ్డి, కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డిలకు అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక కోసం తరలిస్తున్నట్లు పట్టుబడినవారు వెల్లడించారని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
వీరి వద్ద నుంచి రూ.1కోటి నగదు, రెండు కార్లు, ఒక బైక్, ఆరు సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవల్‌రాజు, జి.శ్రీకాంత్‌సాగర్, విజయకుమార్, నగేశ్, కుమార్‌లు పట్టుబడ్డారు. వి.హర్షవర్ధన్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, కోమటిరెడ్డి సుమంత్‌రెడ్డి, కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డిలు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నంలోనూ….
మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఇబ్రహీంపట్నం-సాగర్ హైవేపై తనిఖీలు చేపట్టిన ఎస్‌వోటీ పోలీసులు.. ఓ కారులో తరలిస్తున్న రూ. 64.63 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారులో పట్టుబడిన డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతోనే.. కారును పట్టుకున్నట్టుగా తెలుస్తోంది.