TG Birth Certificate : బర్త్ సర్టిఫికెట్ పొందటం ఎలా..? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి
Birth Certificate in Telangana : పుట్టిన తేదీ ధ్రువపత్రం లేదని ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సర్టిఫికెట్ ను చాలా సులభంగా పొందవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మీ-సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన పత్రాలు, సర్టిఫికెట్ జారీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జనన ధ్రువీకరణ పత్రం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సర్టిఫికెట్ లేకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతాయి. ఓ వ్యక్తి ఎక్కడ జన్మించాడు..? పుట్టిన తేదీ..? తల్లిదండ్రులు ఎవరు..? అనే అంశాలను నిర్ధారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది.
జనన మరియు మరణాల నమోదు చట్టం- 1969 ప్రకారం ప్రతి జననాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయాలి . ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలను పొందడానికి పౌరులందరూ జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది.
ఎక్కడ దరఖాస్తు చేయాలి..?
పుట్టినతేదీ సర్టిఫికెట్ కోసం దగ్గరలోని ఏదైనా మీసేవా కేంద్రంకు వెళ్ళాలి. అక్కడ వారు అడిగిన పత్రాలతో పాటు రుజువులను ఇవ్వాలి. మీ-సేవా కేంద్ర నిర్వాహకులు CDMA లో మీరు ఇచ్చిన సమాచారాన్ని పెట్టి దరఖాస్తు చేస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్లు…
- బిడ్డ జన్మించిన ఆసుపత్రి లేదా వైద్యా సంస్థ ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల గుర్తింపు రుజువు పెట్టాలి.
- తల్లిదండ్రుల ఆధార్ కార్డులను అందజేయాలి. పుట్టిన పిల్లల పేరు దరఖాస్తు ఫారమ్ పైన రాసి ఇవ్వాలి.
- తెలంగాణలో జనన ధృవీకరణ పత్రాన్ని పుట్టిన తేదీ నుంచి 21 రోజుల్లోపు సంబంధిత అధికారులు CDMAలో నమోదు చేస్తారు.
- ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు లేదా ఆస్పత్రులలో ప్రసవం జరిగితే.. అటువంటి వివరాల్ని ఆరోగ్య శాఖ వారు వివరాలు CDMA వెబ్ సైట్ లో పొందుపారుస్తారు. పొందుపరిచిన వెంటనే మీ -సేవాలో అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జనన నమోదు రికార్డుల్లో వివరాలు అందుబాటులో ఉంటే… దరఖాస్తుదారు జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. సంబంధిత వివరాలు లేకపోతే అలాంటి వారు సమీపంలోని మున్సిపల్ లేదా పంచాయతీ ఆఫీస్ ను సంప్రదించాలి.
తప్పుల సవరణ చేసుకోవడం ఎలా?:
- పొరపాటున బర్త్ సర్టిఫికెట్ పొందేటప్పుడు ఏదైనా తప్పులు దొర్లితే మీ -సేవాలో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
- పేరు తప్పుగా ఉంటే న్యాయవాది ద్వారా నోటరీ పొంది మీ -సేవాలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసిన వారం లోపల సంబంధిత అధికారులు పరిశీలించి పుట్టినతేదీ సర్టిఫికెట్ ను అప్రూవ్ చేస్తారు.
- పాస్ట్ పోర్టు, ఉన్నవిద్య, బ్యాంకు ఖాతాలను తెరవటంతో పాటు మరికొన్నింటికి దరఖాస్తు చేసుకోవడానికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ అవసరపడుతుంది.
ఏడాదిలోపు బర్త్ సర్టిఫికెట్ తీసుకోకపోతే ఎలా :
తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన ఏడాదిలోపు పుట్టినరోజు సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఏడాదిలోపు సర్టిఫికెట్ పొందాలంటే అధికారులు పొందుపరిచిన సమాచారం ప్రకారం మీ -సేవాలో పొందవచ్చు. ఒకవేళ ఏడాది దాటినట్లయితే.. కచ్చితంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రోసిడింగ్ పొందాల్సి ఉంటుంది. దీనినే LRBD ( లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ) అంటారు.
ఇలా పొందాలంటే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సంతకం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ( స్థానిక గ్రామపంచాయతీ ద్వారా ), అఫిడవిట్ తో పాటు దరఖాస్తు ఫారం నింపి మీ -సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించిన తర్వాత ప్రొసీడింగ్ కాపీ అందజేస్తారు. వెంటనే ప్రొసీడింగ్ కాపీని స్థానిక గ్రామపంచాయతీ సెక్రటరీకి లేదా మున్సిపల్ అధికారికి అందజేసి బర్త్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం