Miyapur Lands : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు - మియాపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు-high tension at miyapur over govt land encroachment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miyapur Lands : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు - మియాపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు

Miyapur Lands : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు - మియాపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ విధింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 23, 2024 12:27 PM IST

High Tension at Miyapur : హైదరాబాద్ లోని మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్కార్ భూముల్లో గుడిసెలు వేసేందుకు వేలాది మంది తరలిరావటంతో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం పోలీసులపై రాళ్లదాడి కూడా జరిగింది.

మియాపూర్ లో ఉద్రిక్తత
మియాపూర్ లో ఉద్రిక్తత

High Tension at Miyapur : హైదరాబాద్ లోని మియాపూర్‌లోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతారవరణం నెలకొంది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో… పరిస్థితి అదుపు తప్పింది. 

yearly horoscope entry point

శనివారం దాదాపు 2 వేల మంది గుడిసెలు వేసేందుకు యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు.  తిరగబడిన జనం… పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ్నుంచి పోలీసులు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. 

మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల పలువురు ఈ భూముల్లో గుడిసెలు వేసే ప్రయత్నం చేయడంతో అధికారులు అడ్డుకున్నారు. వీరికితోడు చాలా మంది ఈ భూముల్లో గుడిసెలు వేయాలని భావించారు. శనివారం దాదాపు వేలాది మంది భూముల్లోకి చొచ్చుకొచ్చి గుడిసెలు వేయబోయారు. 

కబ్జా వ్యవహారంపై హెచ్ఎండీఏతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందింది. ప్రభుత్వ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు… అక్కడ్నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి వచ్చిన వారు…. పోలీసులపైకి రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. గుడిసెలు వేసేందుకు వచ్చిన వారు రాత్రి వరకు అక్కడే తిష్టవేసి ఉన్నారు.

144 సెక్షన్ విధింపు….

 పోలీసులపై రాళ్ల దాడితో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగటంపై సైబరాబాద్ సీపీ రంగంలోకి దిగారు. మియాపూర్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి జూన్ 29వ తేదీ వరకు 144సెక్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.

పలువురిపై కేసులు…..

మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని గుర్తించారు.  ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని  సంగీత రెచ్చగొట్టారని…స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని విచారణలో తేలింది.

మియాపూర్ సర్కార్ స్థలాల కబ్జా కేసులో పది మంది పై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు విధించారు. వీరంతా కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

సీపీ ఏమన్నారంటే..?

తాజా పరిస్థితిపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి మాట్లాడారు. మియాపూర్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొన్ని రోజులుగా మియాపూర్ లోని ప్రభుత్వ స్థలంలో స్థానిక ప్రజలు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని… ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని… అన్ని కోణాల్లో విచారిస్తున్నామని  చెప్పారు. హెచ్ఎండీఏ అధికారుల నుంచి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

 

Whats_app_banner