Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా 'పశువుల గణన'.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న అధికారులు-government has decided to do cattle census through geo tagging in adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా 'పశువుల గణన'.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న అధికారులు

Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా 'పశువుల గణన'.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న అధికారులు

HT Telugu Desk HT Telugu
Sep 01, 2024 03:33 PM IST

Adilabad : జియో ట్యాగింగ్ ద్వారా పశు గణన కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఇందు కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనాభా గణన లాగే పశువుల గణన కూడా చేపట్టి గణాంకాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పశువుల గణన
ఆదిలాబాద్ జిల్లాలో పశువుల గణన

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ప్రతీ గ్రామపంచాయతీలో ఎన్ని పశువులు ఉన్నాయి.. వాటి వివరాలు నమోదు చేసుకునేలా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రెండు రోజుల్లో శిక్షణ అనంతరం.. ఒకటో తేదీ నుండి గ్రామాల వారిగా పశువుల లెక్క పకడ్బందీగా తేల్చనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు, విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన చేపట్టనుండగా.. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రెండో సారి చేపట్టనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పశు గణన కార్యక్రమం 21వది కావడం గమనార్హం. 2019లో జియో ట్యాగింగ్ ద్వారా చేపట్టిన పశుగణన అనంతరం.. ఆధునిక సాంకేతిక సమాచారంతో ప్రత్యేక యాప్‌లో పశువుల లెక్కపై వివరాలు నమోదు చేయనున్నారు. పశువులను లెక్కించడానికి ఈసారి మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఈయాప్‌ను ఎలా నియోగించాలో, ఇంటింటికి వెళ్లి ఎలా వివరించాలోనన్న వివరాలపై ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లక శిక్షణ ఇస్తున్నారు.

రెండు మూడు రోజుల శిక్షణ అనంతరం క్షేత్రస్తాయిలో గ్రామాల వారిగా పశువుల సంఖ్య ఎంత, గతంలో కంటే గ్రామాల వారిగా ఎంత పశువులు సంతతి పెరిగింది అన్న అంశాలపై వివరాలు సేకరించనున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి పశు గణన కార్యక్రమం చేపట్టనుండగా.. ఎన్యుమరేటర్లు యాప్‌లో నమోదు కోసం ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ మొబైల్ యాప్‌లో ఇంటి యజమాని వివరాలతో పాటు యజమానికి ఉన్న భూమి వివరాలు, పశువుల వివరాలు, పాడి పశువులు ఎన్ని, జెర్సీ, దేశీ ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, తదితర పాడి పరిశ్రమకు సంబంధించి వివరాలు ప్రత్యేకంగా సేకరించనున్నారు.

ఆ తర్వాత వి వరాలను యాప్‌లో నమోదు చేయనున్నారు. ఆడ, మగ వివరాలతో పాటు పశువుల వయస్సు, పాలు ఇచ్చే పశువుల సంఖ్యను నమోదు చేయనున్నారు. యాప్‌లో ఉండే ప్రతీ అంశానికి సంబంధించి రైతుల నుండి సమాచారం సేకరిస్తామని.. స్థానిక పశువైద్యశాఖాధికారులు తెలిపారు.

ఎన్యుమరేటర్సే కీలకం..

ఉమ్మడి జిల్లాలో 435 మంది ఎన్యుమరేటర్లు ఉన్నారు. వారికి మొబైల్ యాప్‌లో నమోదుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పశుగణన లెక్కించేందుకు ఎన్యుమరేటర్సే కీలకంగా మారనున్నారు. పశుసంవర్ధక శాఖలోని సిబ్బంది క్షేత్రస్థాయిలో పశువుల సంఖ్యపై లెక్క తేల్చనున్నారు. నాలుగు నెలల పాటు పశు గణన కార్యక్రమం పూర్తి చేసి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంఖ్యను చెప్పనున్నారు. జిల్లాల వారిగా విభజించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. నెలకు కనీసం వెయ్యి నుండి పదిహేను వందల వరకు ఇళ్లకు వెళ్లి పశువుల సంఖ్య వివరాలు యాప్‌లో నమోదు చేయనున్నారు.

కీలకంగా భావిస్తున్న ఎన్యుమరేటర్లకు.. ఒక్కో ఇంటికి తొమ్మిది రూపాయల 50 పైసలు చొప్పున భృతి చెల్లించనున్నారు. ఒక్కొ ఎన్యుమరేటర్‌కు 4500ల కుటుంబాలను అప్పగించి.. పశు గణణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పశుసంవర్ధక శాఖలో పనిచేసే సిబ్బందికి.. బాధ్యతలు అప్పగించి ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

(రిపోర్టింగ్- వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి)