Food Safety Raids: సంగారెడ్డిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ లు, గడువు ముగిసిన ఆహార పదార్ధాలు స్వాధీనం
Food Safety Raids: సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్ లలో కూడా ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. రాష్ట్రవ్య్రాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు,హోటళ్ల పై వరుసగా దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నా పలువురిలో ఎలాంటి మార్పు కనబడటం లేదు.
Food Safety Raids: సంగారెడ్డి పట్టణంలోని షైన్ బావర్చి హోటల్, స్నాక్ కింగ్ - కరాచీ బేకరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు. ఈ తనిఖీలలో కుళ్లిపోయిన కూరగాయలు,నాసిరకం ఆహార పదార్ధాలు,గడువు ముగిసిన ఆహార పదార్ధాలు,అపరిశుభ్రంగా ఉన్న వంట గదులు,లేబుల్స్ లేని బ్రెడ్, బిస్కెట్స్ వంటి వాటిని గుర్తించారు. గడువు ముగిసిన,లేబుల్స్ లేని ఆహార పదార్ధాలను సీజ్ చేసినట్లు ఫుడ్ ఇన్స్పైక్టర్ ధర్మేందర్ తెలిపారు.
కుళ్లిపోయిన టమోటాలు,క్యారెట్లు …
ఈ తనిఖీలలో షైన్ బావర్చి హోటల్లో సుమారు 5 కిలోల కుళ్లిపోయిన టమోటాలు, క్యారెట్,క్యాబేజీ,కాలిఫ్లవర్ గడువు ముగిసిన టుటి ఫ్రూటీ, బేకింగ్ పౌడర్, ఆల్ టైమ్ కేక్ మిక్స్, ఫుడ్ కలర్స్, కిస్సాన్ జామ్,లాలీ క్యాండీ వంటి పదార్ధాలను గుర్తించారు. షైన్ బావర్చి రెస్టారెంట్ లో ఫుడ్ లైసెన్స్ ప్రదర్శించబడలేదు.
కిచెన్ ఫ్లోర్ అపరిశుభ్రంగా ఉండటం,టైల్స్ లేకుండా జిడ్డు అంటుకుని జిగటగా ఉండటాన్ని గుర్తించారు. అదేవిధంగా కిచెన్ లో చాలా చోట్ల నేల తెగిపోయి గుంతల్లో నీరు చేరడాన్ని గమనించారు. హోటల్ లో పాత్రలు అపరిశుభ్రంగా వున్నాయి. వెజ్ & నాన్ వెజ్ ఒకే డీప్ ఫ్రీజర్‌లలో నిల్వ చేయబడడం,కూరగాయలు కుళ్లిపోవడం గుర్తించారు. అదేవిధంగా బేకరీ ప్రాంతంలోని ట్రేలు తుప్పు పట్టివుండడం, వంటగది, బేకరీ తయారీ ప్రాంతం మొత్తం చెత్తతో అపరిశుభ్రంగా ఉన్నాయి.
టుటి ఫ్రూటీ, బేకింగ్ పౌడర్, ఆల్ టైమ్ కేక్ మిక్స్, ఫుడ్ కలర్స్, కిస్సాన్ జామ్, లాలీ క్యాండీ వంటి గడువు ముగిసిన రూ. 8,120 విలువగల పదార్ధాలు అపరిశుభ్రంగా పడి ఉన్నాయని తెలిపారు. దీంతో షైన్ బావర్చి హోటల్ లో రూ. 8320 విలువ గల లేబుల్ లేని మిల్క్ బ్రెడ్, షార్ట్ బన్, రౌండ్ బన్, బిస్కెట్లు, రస్క్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు .
గడువు ముగిసిన ఆహార పదార్ధాలు …
స్నాక్ కింగ్ -కరాచీ బేకరీలో తనిఖీ లు నిర్వహించగా కౌంటర్ వద్ద లైసెన్స్ ప్రదర్శించ లేదు. బేకరీలో సుమారు 2 కిలోలు లేబుల్ లేని తరిగిన చీజ్ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేశారు. గడువు ముగిసిన బటన్ మష్రూమ్, మాలా స్ట్రాబెర్రీలు ఉన్నాయి. తిలక్ ఖర మేతి, తిలక్ ఖర సాదా యొక్క ఇన్యాక్టివ్ లైసెన్స్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం ఆహార పదార్ధాలను, తారీకు ముగిసిన ఆహార పదార్ధాల ను ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్లు, రెస్టారెంట్లు,బేకరీలు ,ఇతర ఆహార వ్యాపారులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు .
కల్తీ చేస్తే కఠిన చర్యలు …
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఆహార వ్యాపారం చేసే వారి పై చర్యలు తప్పవని పేర్కొన్నారు . నాసిరకం ఆహార పదార్ధాల విక్రయాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలు, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్-2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)