Crocodile On Road: నడిరోడ్డుపై భారీ మొసలి, బంధించిన రైతులు
Crocodile On Road: నీటిలో ఉండాల్సిన మొసలి నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. మహబూబ్‌నగర్ అమరచింత సమీపంలో అర్థరాత్రి రోడ్డుపై ప్రత్యక్షమైన భారీ మొసలిని చూసి జనం బెంబేలెత్తిపోయారు. కొందరు సాహసంతో దానిని బంధించి అటవీ శాఖకు అప్పగించారు.
Crocodile On Road: మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత శివార్లలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన భారీ మొసలి స‌్థానికుల్ని బెంబేలెత్తించింది. పట్టణ శివార్లలోని విద్యుత్తు సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం అర్ధరాత్రి అమరచింత - మరికల్ ప్రధాన రహదారిని దాటుతున్న మొసలి ఆ మార్గంలో వెళుతున్న వారికి కనిపించింది. పొలం నుంచి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్న యువ రైతులు దానిని చూసి తాళ్లతో బంధించారు.
పట్టణంలోని పెద్ద చెరువు నుంచి విద్యుత్తు సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న చింతల చెరువులోకి మొసలి వెళ్తున్నట్లు గుర్తించి దానిని బంధించారు. తాళ్ళతో మొసలిని బంధించిన విషయం బుధవారం ఉదయం అమరచింత వాసులకు తెలియడంతో దానిని చూసేందుకు ఎగబడ్డారు. స్థానిక ఎస్సై జగన్‌మోహన్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మొసలిని వాహనంలో తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ విడిచిపెట్టారు.