Karimnagar Farmers: రుణ మాఫీతో రైతన్నల్లో ఆనందం, ఉమ్మడి జిల్లాలో129669మందికి రుణ మాఫీ
Karimnagar Farmers: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. తొలివిడతలో లక్షలోపు రుణం మాఫీ అయి, రైతన్నల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి.
Karimnagar Farmers: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో లక్షలోపు క్రాప్ లోన్ ఉన్న 1,29,669 మంది రైతులు రుణ విముక్తులయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో అన్నదాతలు ఆనందంలో మునిగి తేలారు. రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామగ్రామాన రైతు వేదికల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
రుణమాఫీని అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు సంరక్షణ సమితి అధ్యక్షులు రాష్ట్ర సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదికల వద్దకు చేరుకుని రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొని డోలు వాయిస్తూ సందడి చేశారు.
రాజీనామా పత్రం సిద్ధం చేసుకో...
రైతుల రుణమాఫీ షురూ అయింది...మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నీ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో అంటూ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా దస్త్రం సిద్ధం చేసుకుని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయననే మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ లో జరిగిన రైతు సంబరాల్లో ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే హేళన చేసిన బిఆర్ఎస్ నేతలు, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రాజీనామా చేయడంతో పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయననే మాటకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని విడతల వారిగా ఆగష్టు 15 లోగా రైతుల రెండు లక్షల వరకు పంటరుణం మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే రోజు 7000 కోట్లు 11లక్షల 50 వేల మంది రైతులకు లక్షలోపు రుణంమాఫీ చేసి ఆ మొత్తాన్ని రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.
దేశ చరిత్రలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారం చేపట్టి పదేళ్ళలో ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిందని విమర్శించారు. గతంలో రెండు సార్లు లక్ష రుణమాఫీ కేవలం 21 వేల కోట్లు మాత్రమే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సారి 35 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇప్పటిదాకా దేశంలో గుజరాత్ మోడల్ కాగా, నేటి నుంచి తెలంగాణ మోడల్ కాబోతుందన్నారు. రుణమాఫీ చేస్తామంటే కాంగ్రెస్ ను విమర్శించిన బిజేపి బిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలని కోరారు.
బైక్ ర్యాలీలు...స్వీట్ల పంపిణీ
లక్ష వరకు పంట రుణాలు మాఫీ అయి రైతుల ఖాతాలో జమ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రైతులు బైక్ ర్యాలీ నిర్వహించగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆద్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)