Fake Currency : రూ. 7 లక్షల నకిలీ నోట్లు..! జగిత్యాల జిల్లాలో ముఠా అరెస్ట్-fake currency gang arrested in jagityala district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Currency : రూ. 7 లక్షల నకిలీ నోట్లు..! జగిత్యాల జిల్లాలో ముఠా అరెస్ట్

Fake Currency : రూ. 7 లక్షల నకిలీ నోట్లు..! జగిత్యాల జిల్లాలో ముఠా అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Aug 04, 2024 06:26 AM IST

Jagtial District Crime News : జగిత్యాల జిల్లాలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్ అయింది. ఆరుగురిని అరెస్ట్ చేయగా… నకిలీ నోట్లు, కారు, బైక్, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్ల ముఠా అరెస్టు..
నకిలీ నోట్ల ముఠా అరెస్టు..

జగిత్యాల జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. అంతర్ జిల్లా నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఏడు లక్షల నకిలీ నోట్లు, కారు, బైక్, 6 సెల్ ఫోన్లు, 5000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఉమామహేశ్వర రావు సమక్షంలో అరెస్టు అయిన ఆరుగురిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా తాళ్ళధర్మారంకు చెందిన సదాల సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన బిట్టు అలియాస్ శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్, కళకుంట్ల గంగారం, బొంగురాల పుల్లయ్య, మునిమేకల అశోక్ ఆరుగురు జల్సాలకు అలవాటు పడ్డారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగ నోట్లు చలామణి చేసే ముఠాగా ఏర్పాడ్డారు. 

అసలు నోట్లకు రెండింతల నకిలీ నోట్లు ఇస్తాం అంటూ మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు ఏడాది కాలంగా ఇద్దరు చొప్పున ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో అసలు నోట్లకు నకిలీ నోట్లు రెండింతలు ఇస్తూ పలువురి వద్ద 10 లక్షల వరకు లాక్కుని మోసానికి పాల్పడ్డారు. ఈనెల ఒకటిన పెద్దగుండు వద్ద దాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష లాక్కొని పారిపోగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, రాజులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయిందని డిఎస్పీ తెలిపారు. 

నకిలీ నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ కోరారు. ఇప్పటికే మార్కెట్లో నకిలీ నోట్లు చలామణి అయిన నేపథ్యంలో జాగ్రత్తగా పరిశీలించాలని అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడంలో ప్రత్యేక దృష్టి సారించి వెంకట్రావుపేట్ వీరేంద్ర ధాబాలో ఆరుగురిని గుర్తించి అరెస్టు చేశామని డిఎస్పీ తెలిపారు. నకిలీ నోట్ల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.