BJP Telangana : మోదీ సభలో కనిపించని కీలక నేత...! ఆ వార్తలు నిజం కాబోతున్నాయా..?
BJP Telangana Latest News : ఓరుగల్లు వేదికగా భారీ సభను తలపెట్టింది బీజేపీ. ఇందుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే మొన్నటి వరకు కీలకంగా ఉన్న ఓ నేత మాత్రం ఈ సభలో కనిపించలేదు. ఫలితంగా ఆయన పక్క పార్టీల వైపు చూస్తున్నారా అన్న టాక్ జోరందుకుంది.
BJP Telangana: గత కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన కొందరు నేతలు స్థానిక నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయటం... ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాషాయ నాయకత్వం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ ను తప్పించి... కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. కోమటిరెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవటంతో పాటు.... రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు పర్యటనకు వచ్చిన ప్రధాని... ఓరుగల్లు వేదికగా ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కీలక నేతలంతా హాజరుకాగా... మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్ మాత్రం రాలేదు. ఇదీ కాస్త... రాజకీయాల్లో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ కార్యక్రమాలకు దూరం...!
కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. బీజేపీలో చేరాలనుకున్న నేతలు కూడా.... కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఈ ప్రభావం కాస్త బీజేపీపై పడింది. ఆ పార్టీలోకి చేరికలు ఆగిపోయాయి. ఇదే సమయంలో పార్టీలోని నేతల మధ్య కూడా విబేధాలు కూడా ఇబ్బందికరంగా మారింది. మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టిపెట్టాయి. ఎన్నికలపై అన్ని కోణాల్లో కసరత్తు చేస్తున్నాయి. చేరికలపై కూడా ఫోకస్ పెట్టాయి. కీలక నేతలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. అయితే బీజేపీలోని పలువురు నేతలు... పార్టీ మారేందుకు సిద్ధమైవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా... మాజీ ఎంపీ వివేక్ పేరు తెరపైకి వస్తోంది. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓరగల్లులో తలపెట్టిన మోదీ సభలో కూడా ఆయన కనిపించలేదు. అయితే ఆయన ప్రస్తుతం కేరళ టూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈటల - వివేకా మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికితోడు ఈటలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం కూడా వివేక్ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.
ఏ పార్టీలోకి...?
ఇక త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై వివేక్ క్లారిటీ ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఆయనతో బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తోంది. పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదే కాకుండా... కాంగ్రెస్ నేతలు కూడా వివేక్ తో టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో వివేక్ కు విస్తృతమైన సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కేరళ టూర్ ముగించుకోని రాష్ట్రానికి వచ్చిన తర్వాత... కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది…!