టీఆర్ఎస్ కు మరో షాక్… కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే-ex mla thati venkateswarlu join congress presence of revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  టీఆర్ఎస్ కు మరో షాక్… కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ కు మరో షాక్… కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 05:17 PM IST

టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు… కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు
కాంగ్రెస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు (facebook)

aswaraopeta ex mla join in congress: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై గత కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ లో చేరారు. ఇవాళృ గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

త్వరలో చేరికల తుపాన్…

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్​రెడ్డి.. వెంకటేశ్వర్లు చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలనూ కాంగ్రెస్​ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తొందరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​లోకి చేరికల తుపాన్​ రాబోతోందని స్పష్టం చేశారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా...

2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తాటి వెంకటేశ్వర్లు. తర్వాత అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా.. టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు.

పార్టీపై విమర్శలు...

టీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన తాటి వెంకటేశ్వర్లు... పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన రాజ్యసభ సభ్యలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిల కృతజ్ఞత సభకు సంబంధించిన ఫ్లెక్సీల్లోనూ తన ఫొటో వేయలేదని వాపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలోనూ ఓట్లు వేయించలేకపోయారని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి తుమ్మలకు లేదన్న వెంకటేశ్వర్లు... ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో గిరిజన ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయని విమర్శించారు.

తాను 1981లోనే సర్పంచ్‌గా గెలిచినని... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తనకి జూనియర్‌ అవుతారని వ్యాఖ్యానించారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేసినప్పటికీ అయన ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదని చెప్పారు. ఇప్పటికైనా అధిష్ఠానం స్పందించకపోతే పార్టీని వీడటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతోనే... ఆయన కాంగ్రెస్ లో చేరారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా టీఆర్ఎస్ ను వీడిన సంగతి తెలిసిందే. ఆమె కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

IPL_Entry_Point

టాపిక్