200 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలమట్టం.. తాడ్వాయి ఫారెస్ట్ పరిస్థితి ఏంటి..?-environmental crisis due to heavy rains tadvai forest faces destruction ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  200 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలమట్టం.. తాడ్వాయి ఫారెస్ట్ పరిస్థితి ఏంటి..?

200 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలమట్టం.. తాడ్వాయి ఫారెస్ట్ పరిస్థితి ఏంటి..?

HT Telugu Desk HT Telugu
Sep 04, 2024 09:19 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదలు కాలనీలు ముంచెత్తుతుండగా.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా దెబ్బతినడం కలకలం రేపుతోంది.

అడవుల్లో నేలకూలిన చెట్లను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు
అడవుల్లో నేలకూలిన చెట్లను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా ఫారెస్ట్ రేంజ్ లో ఏకంగా 200 హెక్టార్లలో చెట్లు నేల మట్టం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా అటవీ ప్రాంతాలు ప్రభావితమైన దాఖలాలు చాలా తక్కువే. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలకు చిన్న, పెద్ద వృక్షాలు అన్ని కలిపి 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఏరియా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణ ప్రారంభించిన ఆఫీసర్లు

రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ శనివారం రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. కాగా ములుగు జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉండగా.. అది ఫారెస్ట్ ఏరియాపై ఎక్కువ కనిపించింది. ఏకంగా 200 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం అయ్యాయంటే మామూలు విషయం కాదు. అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అసలు ఫారెస్ట్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంపై విచారణకు ఆదేశించారు.

ఈ మేరకు వరంగల్ సీసీఎఫ్ ప్రభాకర్, ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్, ఇతర అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఒక దఫా ఎంక్వైరీ చేసి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చెట్లు నేలకూలిన ప్రదేశాన్నంతా కలియ తిరిగారు. ఒక్క గాలివానకే ఇంత పెద్ద నష్టం జరగడం ఇదే తొలిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా.. బుధవారం టెక్నికల్ టీమ్ అధికారులు కూడా అటవీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక తయారు చేయనున్నట్లు తెలిసింది.

మట్టి శాంపిల్స్ సేకరణ

అటవీ ప్రాంతం నేలమట్టం కావడంపై ఫారెస్ట్ అధికారులు శాస్త్రీయ కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఈ మేరకు చెట్లు కూలిపోయిన ప్రదేశంలో మట్టి శాంపిల్స్ సేకరించారు. దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని, వాటిని ల్యాబ్‌కు పంపి పరీక్షించే పనిలో పడ్డారు. చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి.. అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా.. లేదా ఇందులో కుట్ర ఏమైనా దాగి ఉందా.. అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల కిందటే మట్టి శాంపిల్స్ కు పంపించగా.. అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఒక వేళ నేల స్వభావం మారితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ ప్రాంత రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ సిబ్బంది వివరించారు.

-రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి

Whats_app_banner