CM Revanth Reddy : దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు-delhi news in telugu cm revanth reddy orders construction of new telangana bhavan asserts division ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy : దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 19, 2023 07:20 PM IST

CM Revanth Reddy : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ దిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

ఆస్తుల విభజనపై ఆదేశాలు

తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళ్తుందని అధికారులు తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

రెండ్రోజుల పాటు పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లిన ఆయన తన అధికార నివాసాన్ని పరిశీలించారు. దిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి చేరుకున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారి అధికారిక నివాసానికి వచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి దిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి... తుగ్లక్‌రోడ్డులోని బంగ్లాకు వచ్చారు. రెండ్రోజుల పాటు ఆయన దిల్లీలోనే ఉండనున్నారు. దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, పీఏసీ నిర్ణయాలపై అధిష్ఠానంతో చర్చించనున్నారు.

Whats_app_banner