హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ కు ఆమోదం తెలపండి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : దిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి... కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
CM Revanth Reddy : హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్ కు ఎన్ఐడీ మంజూరు చెయ్యండి- సీఎం
యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ఐడీ) మంజూరు చేసిందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గోయల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ఐడీని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ఐడీ మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి అన్నారు. కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు.
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు గ్రీన్ ఫీల్డ్ హోదానివ్వండి
కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం అభ్యర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయని, ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, కన్వేయర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు తదితరాలు) టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ మంజూరు చేయాలని సీఎం కోరారు.
జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చెయ్యండి
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (IIHT) మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు.