Komatireddy Rajagopal Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. పార్టీ మారడం ఖాయమేనా?
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన వివాదం.. మళ్లీ కాంగ్రెస్ లో అగ్గి రాజేసినట్టైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. అంతేకాదు.. కీలక కామెంట్స్ చేశారు. ఇక ఆయన పార్టీ మారతారా? అనే చర్చ నడుస్తోంది.
కొన్ని రోజుల కిందటి వరకూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే చర్చ నడిచింది. అయితే మళ్లీ.. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అంటూ.. వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మెుదలైంది. అసెంబ్లీలో తనకు పార్టీ నేతలు అండగా నిలవలేదని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక మళ్లీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ.. మార్పు అంశం తెరపైకి వచ్చింది. గౌరవం లేని చోట తాను ఉండలేనని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయనని చెప్పారు. అంతేకాదు.. పార్టీ మార్పు విషయంపైనా.. స్పష్టతనిస్తానని చెప్పారు. అయితే పార్టీ మార్పు విషయంలో ఒక కండిషన్ పెట్టారు రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ తో పోరాడే పార్టీతోనే.. తన ప్రయాణం ఉంటుందని స్పష్టతనిచ్చాచారు.
కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే దీనిపై రాజగోపాల్ స్పందించారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుందని.. ఏది చేసినా.. ప్రజలకు చెప్పే చేస్తామని స్పష్టతనిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో.. పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉండి కూడా.. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదన్నారు. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాలను పునరద్ధరించకుండా.. కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామంటూ.. కబుర్లు చెబుతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
అయితే కాంగ్రెస్ పార్టీలోని నేతలపై మాత్రం రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సొంత పార్టీలోనే తనకు ఆదరణ కరవైందని రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. సీఎల్పీ మీటింగ్‌కు సైతం హాజరుకాలేదు. కేసీఆర్‌పై బలంగా పోరాడితేనే కాంగ్రెస్‌లోనే ఉంటానని.. లేదంటే.. ఏ పార్టీ గట్టిగా పోరాడితే అందులోనే చేరుతానని చెప్పారు. తాను ఏం చేసినా.. ప్రజల కోసమేనని స్వార్థం కోసం పార్టీ మారనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
‘కేసీఆర్‌ను గద్దె దించే ఏ పార్టీకైనా మద్దతిస్తాను. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ చేరుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదు. అదంతా దుష్ప్రచారం. ఏది చేసినా.. ప్రజలకు చెప్పే చేస్తాను.’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
టాపిక్