Warangal CP: గంజాయి పట్టిస్తే నగదు బహుమతి, వరంగల్ ప్రజలకు కమిషనర్ అంబర్ కిషోర్‌ ఝా బంపర్ ఆఫర్-commissioner amber kishore jha offers cash reward to people of warangal if they catch ganja ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Cp: గంజాయి పట్టిస్తే నగదు బహుమతి, వరంగల్ ప్రజలకు కమిషనర్ అంబర్ కిషోర్‌ ఝా బంపర్ ఆఫర్

Warangal CP: గంజాయి పట్టిస్తే నగదు బహుమతి, వరంగల్ ప్రజలకు కమిషనర్ అంబర్ కిషోర్‌ ఝా బంపర్ ఆఫర్

HT Telugu Desk HT Telugu
Jul 15, 2024 09:53 AM IST

Warangal CP: ఓరుగల్లు ప్రజలకు వరంగల్ పోలీస్ కమిషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టిన ఆయన.. గంజాయి పట్టిస్తే నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు.

గంజాయి పట్టిస్తే  నగదు బహుమతి ప్రకటించిన  వరంగల్ సీపీ
గంజాయి పట్టిస్తే నగదు బహుమతి ప్రకటించిన వరంగల్ సీపీ

Warangal CP: ఓరుగల్లు ప్రజలకు వరంగల్ పోలీస్ కమిషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టిన ఆయన.. గంజాయి పట్టిస్తే నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. మత్తు పదార్థాల నివారణలో భాగంగా ఈ మేరకు సీపీ అంబర్ కిషోర్ ఝా బంపర్ ఆఫర్ ప్రకటించగా, జనాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

ఇదిలాఉంటే మత్తు పదార్థాల నియంత్రణకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కంట్రోల్ టీంను కూడా సీపీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా, గంజాయిలాంటి మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా ఈ యాంటీ డ్రగ్స్ టీం నిరంతర నిఘా పెడుతుంది.

కాగా డ్రగ్స్ కంట్రోల్ టీమ్ కు ఒక రిజర్వ్ ఇన్ స్పెక్టర్, ముగ్గురు ఆర్ఎస్సైలు, మరికొంతమంది పోలీస్ సిబ్బందితో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయగా, వరంగల్ ట్రై సిటీతో పాటు కమిషనరేట్ లోని రూరల్ ఏరియాల్లో టీమ్ సభ్యులు విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారు.

స్కూళ్లు, కాలేజీలపై నిఘా

కమిషనరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీమ్ గంజాయిలాంటి మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరా జరిగే ప్రాంతాలపై దృష్టి పెట్టనుంది. అంతేగాకుండా డ్రగ్స్ సేవించేందుకు అనువైన ప్రదేశాలు, మెయిన్ జంక్షన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ తో పాటు కాలేజీలు, పాఠశాలల సమీపంలో గంజాయి అడ్డాలపై ఫోకస్ పెట్టనున్నారు.

స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ నిరంతర గస్తీ కొనసాగిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గంజాయి అడ్డాలపై మెరుపు దాడులు చేయడం, గంజాయి అడిక్టర్స్ ను అదుపులోకి తీసుకోని తగు చర్యలు తీసుకోనున్నట్లు సీపీ పేర్కొన్నారు.

అలాగే గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై డ్రగ్స్ కంట్రోల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెడుతుందని, ప్రధానంగా గంజాయి వినియోగించే వ్యక్తులను కట్టడి చేస్తే సరఫరా కూడా ఆగిపోతుందని సీపీ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక ఫోన్ నెంబర్.. పట్టిస్తే ఫ్రైజ్ మనీ

మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పిల్లలు, యువత భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ గంజాయి లాంటి మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కంట్రోల్ లో ప్రజలు పరోక్షంగా కూడా భాగస్వాములు కావాలని కోరారు. మత్తు పదార్థాలను సేవిస్తున్న, విక్రయిస్తున్న, రవాణా చేస్తున్నట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే 87125 84473 నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.

అంతేగాకుండా పెద్ద మొత్తంలో గంజాయి పట్టించిన వారికి భారీగా నగదు పురస్కారం కూడా అందజేస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే ప్రజలందరి ప్రధాన లక్ష్యం కావాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner