TSSPDCL : విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..-cmd of tsspdcl advised to call if power officials demand bribe ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsspdcl : విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..

TSSPDCL : విద్యుత్ అధికారులు లంచం అడుగుతున్నారా.. అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..

Basani Shiva Kumar HT Telugu
Sep 07, 2024 09:58 AM IST

TSSPDCL : చాలా ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నచిన్న పనులకు కూడా లంచాలు అడుగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కొత్త నిర్ణయం
ఫిర్యాదుల స్వీకరణకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కొత్త నిర్ణయం (HT)

విద్యుత్‌ అధికారులు, సిబ్బంది.. ఏ పనికి అయినా డబ్బులు డిమాండ్ చేస్తే.. తమకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని.. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ సూచించారు. ఏదైనా పనుల కోసం లంచం అడిగిన వారిపై ఫిర్యాదు చేయడానికి 040-23454884, 7680901912 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని వివరించారు.

కఠిన చర్యలు తప్పవు..

విద్యుత్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకొని.. పరిష్కరించడానికి ఈ ఏర్పాటు చేసినట్లు సీఎండీ వివరించారు. కొత్త కనెక్షన్లు, కేటగిరీ, వినియోగదారుల పేరు మార్పు, కరెంటు బిల్లుల్లో లోపాలు తదితర సేవలు పొందేందుకు.. సంస్థ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ల ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు సీఎండీ వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే విద్యుత్‌ శాఖ ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎండీ వార్నింగ్ ఇచ్చారు.

ఏసీబీ పట్టుబడిన డీఈ..

సరూర్​నగర్ విద్యుత్ శాఖ డీఈని ఏసీబీ అధికారులు రెడ్ ​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆగస్టు 24న ఆటోనగర్‌లోని డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆగపల్లి గ్రామంలో రెండు ఎకరాల వెంచర్​లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి.. కొత్త ట్రాన్స్​ఫార్మర్లు పెట్టుకోవడానికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్​ ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి.. రూ.18 వేలు ఇవ్వాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్​ను డీఈ రామ్మోహన్ డిమాండ్​ చేశారు. బాధితుడి ఫిర్యాదులో ఏసీబీ డీఈని పట్టుకుంది.

రైతుల వద్ద కూడా..

ఇలాంటివి తెలంగాణలో ఎన్నో జరుగుతున్నాయి. చిన్న చిన్న పనులకు కూడా విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల వద్ద కూడా సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు. తమ అవసరం కోసం ప్రజలు డబ్బులు ఇస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక.. చాలామంది పోతేపోనీ అన్నట్టు ఉంటున్నారు. దీంతో లంచాలు డిమాండ్ చేసేవారు పెరిగిపోతున్నారు.