Telangana Rains : అధికారులు సెలవులు పెట్టొద్దు... 24 గంటలు అలర్ట్ గా ఉండండి - వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని… సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు.
అప్రమత్తంగా ఉండండి - సీఎం రేవంత్
సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అధికారులు సెలవులు పెట్టొద్దని… సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు.
అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
మూసీకి నీటి విడుదల
మరోవైపు హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయి 513.41గా ఉండగా… పూర్తిగా నిండిపోయింది. దీంతో మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.
కోదాడలో వ్యక్తి మృతి…
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోదాడలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎటు చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. ఆదివారం టౌన్ పరిధిలోని భారతి పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో రెండు కార్లు కొట్టుకొని వచ్చాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇవాళ అత్యంత భారీ వర్షాలు…!
ఐఎండీ హైదరాబాద్ రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ(సెప్టెంబర్ 1) తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
- ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
- సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సెప్టెంబర్ 3వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేవని తాజా బులెటిన్ లో పేర్కొంది.