CM Revanth Review : ప్రజలకు తాగునీటి కొరత రావొద్దు - ప్రత్యేక చర్యలకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth On Power and Water Supply : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy, ) ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
CM Revanth On Power and Water Supply : వేసవి దృష్ట్యా... ప్రజలకు తాగు నీటి కొరత రావొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy, ). ఇందుకోసం ప్రత్యేక చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, తాగునీటి సరఫరాతో పాటు పలు అంశాలపై శనివారం ముఖ్యమంత్రి సమీక్షించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి అత్యధికంగా విద్యుత్ సరఫరా చేసి ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని తెలిపారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం(uninterrupted power) రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు.
"రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దీంతో వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి" అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారులకు సూచించారు.
గత ఏడాది (2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగిందని చెప్పారు. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి
"ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలి. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చర్యలు తీసుకోవాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
సంబంధిత కథనం