CM KCR : యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగంగా పూర్తి చేయాలి-cm kcr on yadadri thermal power plant ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగంగా పూర్తి చేయాలి

CM KCR : యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు వేగంగా పూర్తి చేయాలి

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 08:03 PM IST

KCR Yadadri Power Plant Visit : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ఈ ప్రాజెక్టు చేపట్టినట్టుగా తెలిపారు.

యాదాద్రి పవర్ ప్లాంట్
యాదాద్రి పవర్ ప్లాంట్

ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్(Yadadri Thermal Power Project) లాంటివి చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు.

నల్లగొండ(Nalgonda) జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండో ఫ్లోర్ కు చేరుకొని ప్లాంట్(Plant) నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ట్రాన్స్ కో, జెన్ కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకన్నారు. అధికారులు పవర్ ప్లాంట్ గురించి ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు.

ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్(KCR) ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పవర్ ప్లాంట్(Power Plant)కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబందిచిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు.

ఈ నీటి సరఫరాకు కృష్ణా నీళ్లను(Krishna Water) సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్(KCR) సూచించారు. కృష్ణ పట్నం పోర్టు(Krishna Patnam Port), అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పవర్ ప్లాంట్ లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు.

'సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్ లో సోలార్ పవర్ ప్లాంట్స్(Solar Power Plant) కూడా చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్(Sports Complex)కు యాభై ఎకరాలు కేటాయించాలి. సూపర్ మార్కెట్(Super Market), కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం జరగాలి. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాప్ కి అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలి. టౌన్ షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలి.' అని కేసీఆర్ అన్నారు.

దామరచర్ల హైవే నుండి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్ లైన్ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్ ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్(Railway Crossing) వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని మిగితా యూనిట్స్ జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని తెలిపారు.

యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant)కి భూమి ఇచ్చిన రైతులతో పాటు, గతంలో సాగర్ ప్రాజెక్ట్ కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ని, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడిక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం