CM KCR: ధరణి పోతే మళ్లీ దళారీల రాజ్యమే.. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్-cm kcr inaugurated integrated collectorate complex at mancherial ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr: ధరణి పోతే మళ్లీ దళారీల రాజ్యమే.. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్

CM KCR: ధరణి పోతే మళ్లీ దళారీల రాజ్యమే.. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 07, 2023 02:24 PM IST

CM KCR Mancherial District Tour: సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Latest News: మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నూత‌న క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. ఈ సందర్భంగా.. రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు శంకుస్థాపన చేశారు. రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కూడా సీఎం శంకుస్థాప‌న చేశారు.

కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం కేసీఆర్....అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌లో ఉందన్నారు. కేంద్రం నుంచి అనేక అవార్డుల‌ను అందుకుంద‌ని గుర్తు చేశారు. ప‌సికూన అయిన ప‌ది సంవ‌త్స‌రాల తెలంగాణ‌.. మిగ‌తా రాష్ట్రాల‌తో పోటీ ప‌డుతోందని వ్యాఖ్యానించారు. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల కోసం నూత‌న క‌లెక్ట‌రేట్‌ల‌ను నిర్మించుకున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్ప‌ట్నుంచో ఉందన్న ఆయన.... తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబ‌ట్టే మంచిర్యాల‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ టాప్‌లో ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉద్యోగులు ప‌ని చేయ‌డంతో, మంచి ఫ‌లితాల‌ను సాధించామని చెప్పుకొచ్చారు.

అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్న అధికారుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినంద‌న‌లు చెప్పారు. కుల‌వృత్తుల‌కు ఆర్థిక సాయం ప‌థ‌కాన్ని, రెండో విడుత గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని కూడా ఇదే వేదికగా ప్రారంభించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్య‌మంత్రులు కూడా అమ‌లు చేశార‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

అందుకు కారణం ధరణినే…

ఇక మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పవర్స్ కట్స్ లేకుండా తెలంగాణ ఉందన్నారు. 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని చెప్పారు. 'దేశంలో 150 సంవత్సరాలకు విద్యుత్ ఇచ్చే అంత బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ... ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. ఇలాంటి వాటి పట్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ తెలంగాణలో ధరణి తీసుకువచ్చాం. ఎలాంటి పైరవీలు లేకుండా ఇవాళ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుబీమా పేరుతో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇందుకు దరఖాస్తు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అపద్బాందు కింద కేవలం 50 వేల ఇచ్చేవారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలను రైతు బంధు రూపాయల రూపంలో ఇస్తున్నాం. నేరుగా వచ్చి మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయంటే కారణం ధరణి. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.గతంలో ఉన్న ఇబ్బందులు లేవు. వడ్ల అమ్మిన వెంటనే ఐదారు రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉంటే.. ఇవాళ 70 పైగా చేరాయి. రిజిస్ట్రేషన్ల ఆఫీసులు పెంచాం.

వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలి - సీఎం కేసీఆర్

ధరణిని రద్దు చేస్తామని కొన్ని పార్టీలు చెబుతున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. అలా చెబుతున్న పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే... రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అందుతాయా అన్న విషయాన్ని ఆలోచించాలని కోరారు. ధరణితో గట్టు పంచాయితీలు లేవని చెప్పారు. ధరణి పోతే దళారీల రాజ్యం వస్తది. పోలీసులు, కోర్టుల చుట్టు తిరిగే వస్తది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్న వారినే అందులో వేయాలని పిలుపునిచ్చారు. ధరణి ఉండాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దళితబంధుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు.

Whats_app_banner