Nalgonda Crime : మరీ దారుణం.. పింఛన్, రైతుబీమా వస్తుందని మర్డర్
Nalgonda Murder Case : ఇప్పుడంతా డబ్బు మాయ. కేవలం డబ్బు వస్తుందని.. అయినవాళ్లను వదిలేసుకుంటున్నారు. ఎంతోకొంత వస్తుంది కదా అని కావాల్సిన వాళ్లనే కాటికి పంపిస్తున్నారు. ఓ మహిళ కూడా పింఛను, రైతుబీమా వస్తుందని భర్తనే చంపించింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. కుమారుడు కూడా తండ్రి మరణానికి కారణమయ్యాడు.
ఈ మధ్య కాలంలో డబ్బు కోసం హత్యలు(Murders) ఎక్కువైపోయాయి.. ఇందులో అయినవాళ్లూ పాలుపంచుకుంటున్నారు. జీవితాంతం తోడు ఉండాల్సిన వాళ్లు.. చావు కోసం ఎదురుచూస్తున్నారు. విషయం బయటకు తెలియదని నేరాలు చేస్తున్నారు. తీరా ఆరా తీశాక.. నేరస్థులుగా బయటపడుతున్నారు. కేవలం పింఛను(Pension) డబ్బు, రైతుబీమా(Rythu Bheema) వస్తుందని.. ఓ మహిళ కూడా అలానే చేసింది. ఆస్తిలోనే కాదు.. తండ్రి హత్యలోనూ కుమారుడికి వాటా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నల్లగొండ(Nalgonda) జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడేనికి చెందిన దాసరి వెంకటయ్య(55)తో సుగుణమ్మకు 30 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. అయితే వెంకటయ్య ఇల్లరికం అల్లుడిగా పులిమామాడికి వచ్చాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కోటేష్ ఉన్నారు. డబ్బు కొట్టి వెంకటయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెలకు(Daughters) పెళ్లిళ్లు జరిగాయి. కొడుకు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.
వెంకటయ్య పేరు మీద ఎకరం పొలం ఉంది. దీనిని విక్రయించాలని భార్య సుగుణమ్మ, కుమారుడు కోటేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటయ్య అస్సలు ఒప్పుకోవట్లేదు. దీంతో గొడవలై.. భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లీకుమారుడు ఓ ప్లాన్ వేశారు. వెంకటయ్య మరణిస్తే.. రైతు బీమాతోపాటుగా సుగుణమ్మకు పింఛను వస్తుందనుకున్నారు. ఇదే విషయంపై చర్చించుకున్నారు. కానీ చంపేది ఎలా అని ప్రశ్నలు వేసుకున్నారు. వెతకగా... మారుపల్లికి చెందిన మహేశ్ దొరికాడు. లక్ష రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు. కొంత అడ్వాన్స్ ఇచ్చారు.
ఇక పథకం మెుదలుపెట్టారు. నవంబర్ 14వ తేదీన చంపేయాలని ప్లాన్ గీశారు. డప్పు ఇప్పిస్తానని వెంకటయ్యను కుమారుడు కోటేష్ పులిమామిడిలోని ఇంటికి రప్పించాడు. ఏవేవో మాటలు కలిపి.. తండ్రికి మద్యం తాగించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. వెంటనే వరద కాల్వకట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ మరింత మద్యం తాగించారు. అక్కడే మహేశ్, కోటేష్ కలిసి.. వెంకటయ్యను తువ్వాలుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.
మృతదేహాన్ని(Dead Body) తీసుకొచ్చి.. అనుముల నుంచి చినఅనుములకు వెళ్లే దారిలో పడేశారు. వెంకటయ్య ఒంటిపై ఉన్న పంచె, టవల్ తీసుకెళ్లి సుగుణమ్మకు ఇచ్చారు. ఇక ఎవరికీ తమపై అనుమానం రాదు అనుకున్నారు. అనుములకు చెందిన ఓ వ్యక్తి.. గుర్తు తెలియని శవం రోడ్డు మీద పడి ఉందని.. ఊర్లో వాళ్లకి చెప్పాడు. 15వ తేదీన పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ మెుదలుపెట్టారు. చనిపోయింది వెంకటయ్య అని నిర్ధారించుకున్నారు.
చంపింది ఎవరు అని విచారణ మెుదలుపెట్టారు పోలీసులు. వెంకటయ్యతో బార్య, కుమారుడికి గొడవలు అనే విషయం తెలిసింది. నేరుగా వెళ్లి వారిని విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. సెల్ ఫోన్ డేటా(Cell Phone Data), ఇతర వివరాలతో భార్య, కుమారుడే హత్య చేయించారని తెలుసుకున్నారు. సుగురణమ్మ, కోటేష్, మహేశ్ ను అరెస్టు చేశారు.